ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో “తల్లికి వందనం” తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తల్లికి మాత్రమే ఏడాదికి రూ.15,000 అనే ప్రచారం తెరపైకి రావడం.. ఏపీ సర్కార్ ఇచ్చిన జీవోలో అతి తెలివి ప్రదర్శిస్తూనో ఏమో కానీ.. దీనిపై ఎన్నికల హామీల్లో చెప్పినంత స్పష్టంగా పేర్కొనకపోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రధానంగా ఎన్నికల ప్రాచారంలో భాగంగా పాలకొల్లులో ప్రచారం నిర్వహించిన నిమ్మల రామానాయుడు… కుటుంబంలోని మహిళలతోనూ, పిల్లలతోనూ మాట్లాడుతూ ఒక్కొక్కరికీ, ప్రతి ఒక్కరికీ 15,000 రూపాయల చొప్పున వస్తాయని, దానికి సంబంధించిన బాండ్ కూడా ఇచ్చామని చెబుతూ ప్రచారం చేసుకున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదమవుతోన్న నేపథ్యంలో.. తాజాగా స్పందించిన ఏపీ సర్కార్… జీవో అంటే విడుదల చేశాం కానీ విదివిధానాలు ఇంకా ఖరారు చేయలేదంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ సంగతి అలా ఉంటే… అంతకంటే ముందు ప్రెస్ మీట్ పెట్టిన మంత్రి నిమ్మల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి! ఈ వ్యాఖ్యలపై స్పందిస్తున్న నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
తాజాగా “తల్లికి వందనం” వ్యవహారంపై నిమ్మల రామానాయుడిని ప్రశ్నించారు విలేకరులు! ఈ సందర్భంగా స్పందించిన ఆయన.. “తల్లికి వందనం”పై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలా అని పోనీ వాస్తవ ప్రచారం ఏమిటో చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా అమ్మ ఒడి ఒక్కరికే ఇచ్చిన వైసీపీకి తమను ప్రశ్నించే హక్కు లేదని చెప్పుకొచ్చారు.
దీంతో… నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు. టీడీపీని ప్రశ్నించే నైతిక అర్హత వైసీపీకి లేకపోతే లేకపోయింది కానీ… ప్రజలకు ఉంది కదా! ప్రధానంగా తమ పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు అయితే ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షానికి హక్కు లేదని చెబుతున్న నిమ్మల… ప్రజలకు ఉందనే విషయం మరిచిపోతున్నారా అని నిలదిస్తూన్నారు.
ఏరు దాటేశాం కాబట్టి ఇకపై బోడి మల్లన్న అనే కబుర్లు చెబితే జనాలు ఎలా బుద్ది చెప్పాలో అలా బుద్ది చెబుతారని.. 2014లో ఇలా వ్యవహరించబట్టే 2019 ఎన్నికల్లో అలాంటి ఫలితాలు వచ్చాయని.. రామానాయుడు గతం మరిచిపోతే, జనాలు భవిష్యత్తు లేకుండా చేస్తారనే విషయం మరిచిపోకూడదని హితవు పలుకుతున్నారు.
మరి ఇప్పటికైనా ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు.. ప్రశ్నకు విమర్శ సమాధానం కాదు… ప్రతిపక్షాలకో, విమర్శకులకో సమాధానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని భావిస్తే అది వారి ఇష్టం! కానీ ప్రజలకు మాత్రం కచ్చితంగా జవాబు చెప్పి తీరాలి.. లేదంటే ఎన్నికల్లో గట్టేక్కడం కోసం అలవిగాని హామీలు ఇచ్చాము, ప్రజలు నమ్మి మోసపోయారని క్లారిటీ అయినా ఇవ్వాలని కోరుతున్నారు నిమ్మల ఫ్యాన్స్!