Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు విశాఖపట్నం కోర్టుకు హాజరయ్యారు. 2019లో సాక్షి మీడియా తనపై రాసిన కథనానికి సంబంధించి పరువునష్టం దావా కేసులో ఆయన విచారణకు హాజరయ్యారు. దీనిపై మీడియాతో మాట్లాడిన లోకేశ్ తాను విమానాశ్రయం లాంజ్‌లో రూ. 25 లక్షలు ఖర్చు చేశారనే ఆరోపణలను నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసు నేపథ్యంపై మాట్లాడుతూ, సాక్షి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని, ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు.
ప్రజల ముందు దుష్ప్రచారం ద్వారా తన పరువు పోగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తాను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన ప్రయాణాలు, ఆహారం, ఇతర ఖర్చులు సొంతంగా నిర్వహించుకుంటున్నానని స్పష్టం చేశారు. తన తల్లి భువనేశ్వరి నుంచి ఆదర్శాలను పొందానని చెప్పిన లోకేశ్ ప్రజల పక్షాన నిలవడం తన ధర్మం అని చెప్పారు. ఈ పరువునష్టం కేసు విచారణలో ఇప్పటివరకు నాలుగుసార్లు హాజరైనట్లు వెల్లడించారు. నిజం తన వైపు ఉందని, ఎప్పుడు అయినా తన నిజాయితీ గెలుస్తుందనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి తాము ప్రజా దర్బార్‌లను నిర్వహిస్తున్నామనీ, ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పాదయాత్రలతో అందరినీ చేరుకోలేకపోయినా ప్రజలతో క్షేత్రస్థాయిలో టచ్‌లో ఉంటూ సమస్యలపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. మునుపటి ప్రభుత్వ బకాయిలు రూ. 3వేల కోట్లు చెల్లించాల్సి వచ్చినా, ఆ బాధ్యతను చిత్తశుద్ధితో నెరవేర్చుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తున్నానని, పార్టీకి ఎప్పటికీ చెడ్డ పేరు రాకుండా తన వంతు కృషి చేస్తానని నారా లోకేశ్ తెలిపారు.

