ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన సమయంలో స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి. మరోపక్క రైతులు ఆకుమడులకు రెడీ అయిపోతున్నారు! దీంతో… చంద్రబాబు ముందుగా రైతులకు ఇవ్వాల్సిన సహాయం రూ.20,00.. పిల్లలను స్కూల్స్ కి పంపే తల్లులకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ ఒక్కొక్కరీ రూ.15,000 చొప్పున వేస్తారని అంతా భావించారు.
అయితే నరుడు ఒకటి భావిస్తే “నారా”యణుడు ఒకటి తలచిందన్నట్లుగా అది జరగలేదు! ఈ సమయంలో జనాలను గతంలోలాగే ఏమార్చాలని భావించారో ఏమో కానీ… ఒక జీవో విడుదల చేశారు! అందులో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అనే విషయంపై పూర్తి అస్పష్టత ఉంది. దీంతో… పిల్లలు ఎంతమంది ఉన్నా తల్లి ఒక్కరికే రూ.15,000 అనే చర్చ వైరల్ అయ్యింది.
దీంతో వెనకడుగు వేసిన కూటమి ప్రభుత్వం… ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని.. త్వరలో విడుదల చేస్తామని.. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తామని వెల్లడించింది. దీంతో… అప్పటికే తమ తమ పిల్లలను పాఠశాలలో చేర్చిన తల్లులు.. తమకు “తల్లికి వందనం” ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూడటం మొదలుపెట్టారు.
మరోపక్క ఫీజు కోసం స్కూల్స్ నుంచి ఫోన్లు వచ్చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో… ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందేహాలకు తెరదించుతూ ఓ కీలక ప్రకటన చేశారు. తాజాగా మండలిలో మాట్లాడిన ఆయన… చంద్రబాబు లాగా నాన్చివేత ధోరణి ప్రదర్శించకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు.. తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చేశారు.
ఇందులో భాగంగా… తల్లికి వందనం గురించి అందరితో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుచేస్తామని లోకేష్ ప్రకటించారు. అంటే… ఈ ఏడాదికి తల్లికి వందనం ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పేశారు! దీంతో… ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే… తల్లికి వందనం ద్వారా వచ్చే డబ్బులపై తల్లులు చాలా ఆశలే పెట్టుకున్నారు!!
ఈ నేపథ్యంలో… ఈ ఏడాదికి అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని లోకేష్ కుండబద్దలు కొట్టడంతో… చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసగించిందంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా… చంద్రబాబు మార్కు షాక్ మరొకటి ఏపీ ప్రజానికానికి తగిలిందనే భావించాలి!