కాంగ్రెస్ బోణీ… ఏపీ ఎన్నికలపై లేటెస్ట్ సర్వే రిపోర్ట్!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపింస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తులు సాగిస్తోన్నాయి. ఇందులో భాగంగా… అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ఫైనల్ చేసి ఈ నేలలోనే జనాల్లోకి వెళ్లాలని, కేడర్ ను కలుసుకోవాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు! మరోపక్క ఈ నెలాఖరులోగా బీజేపీతో పొత్తు విషయంపై ఒక క్లారిటీ తెచ్చుకుని.. జనసేనతో సీట్ల సర్ధుబాటు, అభ్యర్థుల ఎంపికపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని బాబు భావిస్తున్నారని తెలుస్తుంది.

మరోపక్క బలప్రదర్శన చేసైనా.. తమ స్థాయి ఏమిటో బాబుకు బలంగా చూపించి అయినా వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించాలని, ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని, చట్ట సభల్లో తమ పార్టీకి ప్రాతినిధ్యం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ పరితపిస్తున్నారు. ఇక తాజాగా రంగంలోకి దిగిన వైఎస్ షర్మిల… ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకున్న ప్రభావం వచ్చే ఎన్నికల్లో కంపించేలా చేయాలని భావిస్తున్నారు.

ఇలా ఎవరి స్థాయిలో వాళ్లు రాబోయే ఎన్నికల గురించి కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో… మరోపక్క సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా… పోల్ స్ట్రాటజీ గ్రూప్, పొలిటికల్ క్రిటిక్ సంస్థలు ఇప్పటికే తమ అంచనాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై సర్వే ఫలితాలను ఆయా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా లోక్ పోల్ సంస్థ.. తన ఒపీనియన్ పోల్ సర్వే నివేదికను ప్రకటించింది.

ఇందులో భాగంగా… ఏపీలో లోక్‌ సభ నియోజకవర్గాలపై ఈ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం 25 లోక్‌ సభ నియోజకవర్గాల పరిధిలో దీన్ని చేపట్టింది. వీటి ప్రకారం… వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీకి 13 నుంచి 15 లోక్‌ సభ స్థానాలు దక్కుతాయని లోక్ పోల్ సంస్థ అంచనా వేసింది. అదే సమయంలో టీడీపీ – జనసేన కూటమికి 6 నుంచి 8 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేసింది.

ఆసక్తికరంగా ఈసారి సర్వేలో బీజేపీ, కాంగ్రెస్ లను కూడా పరిగణలోకి తీసుకున్న లోక్ పోల్ సంస్థ వారు కూడా ఏపీలో బోణీ చేసే అవకాశాలున్నాయని చెబుతుంది! ఇందులో భాగంగా… బీజేపీ/ఎన్డీఏ, కాంగ్రెస్ పార్టీలు.. ఒక్కొక్క లోక్‌ సభ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో వచ్చే ఎన్నికల్లో సుమారు దశాబ్ధ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ బోణీ చేయబోతుందా అనే చర్చ మొదలైంది.

కాగా… గత ఏడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఈ సంస్థ నిర్వహించిన సర్వే.. దాదాపుగా నిజమైన సంగతి తెలిసిందే. ఈ సంస్థ వెల్లడించిన అంచనా ఫలితాలు వాస్తవ ఫలితాలకు ఆలో మోస్ట్ దగ్గరగా వచ్చాయి. దీంతో… ఏపీ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఇచ్చిన అంచనాలను కాస్త పరిగణలోకి తీసుకోవచ్చని, కొట్టిపారేయలేమని అంటున్నారు పరిశీలకులు.