ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. తొలి దశ నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు. మరోవైపు రెండో దశలో నామినేషన్ల దాఖలకు కూడా గడువు నిన్నటితో ముగిసింది. అయితే రెండో దశ నామినేషన్ల ప్రక్రియలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో 92 ఏళ్ల బామ్మ నామినేషన్ దాఖలు చేశారు. వార్డు సభ్యురాలిగా బరిలో నిలిచారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన 92 ఏళ్ల గ్రంధి లక్ష్మీనరసమ్మ 8వ వార్డు సభ్యురాలిగా బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు. తన నామినేషన్ పత్రాలను స్టేజ్-1 అధికారికి అందజేశారు. ఈ వయసులో భామ్మ వార్డు మెంబర్ పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు.. మాధవరాయుడుపాలెంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇక, రెండో దశ నామినేషన్ల గడువు గురువారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఫిబ్రవరి ఆరో తేదీన నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించనున్నారు. ఫిబ్రవరి 7న అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 8న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువుగా నిర్ణయించారు. ఇక, రెండో దశ పోలింగ్ ఫిబ్రవరి 13న జరగనుంది. ఏకగ్రీవాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీకి షాకిస్తూ ఏకగ్రీవాలకు బ్రేక్ వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు.