స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 52 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్, అంగళ్లు అల్లర్ల కేసులు తదనుగుణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మరోకేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ ఏ-3గా చేర్చింది. ఇప్పుడు ఇది లేటెస్ట్ హాట్ టాపిక్ గా మారింది.
అవును… చంద్రబాబుపై ఏపీ సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా… గత ప్రభుత్వంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారన్న అరోపణల నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ క్రమంలో… ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు.. కేసులో ఏ-3గా చంద్రబాబును చేర్చారు. శ్రీనివాస శ్రీనరేష్ ను ప్రధాన నిందితుడి(ఏ1)గా, కొల్లు రవీంద్రను రెండో నిందితుడి(ఏ2)గా పేర్కొంది.
దీనికి సంబంధించి బాబు & కో లపై… చట్టానికి లోబడి ఉండకపోవటం (ఐపీసీ 166), నేరపూరిత కుట్ర (ఐపీసీ 120బీ), నేరపూరిత విశ్వాస ఘాతుకం (ఐపీసీ 409), పబ్లిక్ సర్వెంట్ తప్పుడు డాక్యుమెంట్ రూపొందించటం (ఐపీసీ 167)తో పాటు… అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(డీ) రెడ్ విత్ 13(2) సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఏపీబీసీఎల్ ఎండీ ఈ నెల 11న ఫిర్యాదు చేయగా.. 28న సీఐడీలో కేసు నమోదైంది.
తాజాగా ఈ విషయాలపై స్పందించిన బెవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) ఎండీ… మద్యం కంపెనీలకు అనుమతులు ఇచ్చే అంశంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. రెండు బేవరేజ్ లు, మూడు డిస్ట్రిలరీల కోసం 2012లో మద్యం పాలసీనే మార్చేశారని.. 2015లో కొత్త ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వానికి పన్నులు రాకుండా చేశారని.. ఇదే సమయంలో, 8 శాతం వ్యాట్ కాకుండా 6 శాతం పన్నులు తీసేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎఫ్.ఐ.ఆర్. లో ఏముంది?:
తాజా కేసుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. లో… గత ప్రభుత్వం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా, లైసెన్స్ దారులకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా… 2019 మార్చి 8న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొన్ని కొత్త బ్రాండ్లకు అనుమతినిచ్చారు. అనంతరం… మద్యం సరఫరాదారులు, లైసెన్స్ దారులతో కుమ్మక్కై కొన్ని రకాల ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్ సృష్టించారు. దీంతో 70 శాతం ఆర్డర్లు వాటికే వెళ్లాయి.
2015-16 సంవత్సరానికి సంబంధించి బార్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఎక్సైజ్ విధానాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా… బార్లకు కూడా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఆమోదంతోనే ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. ఫలితంగా… రాష్ట్ర ఖజానాకు రూ.1,300 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
ఎక్సైజ్ శాఖ కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వివిధ డిస్టిలరీల ఏర్పాటుకు అనుమతిచ్చారు. విశాఖ డిస్టిలరీస్, పీఎంకే డిస్టిలరీస్ లతో పాటు మరో ముగ్గురికి ప్రయోజనం కల్పించారు. 2019 ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అత్యంత హడావుడిగా పలు బ్రాండ్లకు అనుమతిచ్చారు అని ఎఫ్.ఐ.ఆర్. లో ఆరోపించారు!