AP Home Minister : మహిళలపై అఘాయిత్యాలు ఆగాలంటే, మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. స్కూళ్ళు, కాలేజీలు, పని ప్రాంతాలు.. ఇలా అన్నిచోట్లా మార్పు వచ్చి తీరాల్సిందే. రాజకీయాలూ పరిశుభ్రంగా వుండాలి. అప్పుడే మహిళలపై అఘాయిత్యాలు ఆగుతాయి.
తల్లి తన బిడ్డను బాధ్యతగా చూసుకుంటే అమ్మాయిలపై అఘాయిత్యాలు తగ్గుతాయని హోంమంత్రి స్థాయి వ్యక్తి జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తే ఎలా.? అంటూ ఏపీ హోంమంత్రి తానేటి వనితపై విమర్శలు వెల్లువెత్తున్న వేళ, ‘అనుకోకుండా రేప్ జరిగింది’ అని ఇంకో అలవోక స్టేట్మెంట్ ఆమె ఇచ్చేశారు.
అసలే వైసీపీ పాలన మీద సోకాల్డ్ టీడీపీ అనుకూల మీడియా ఎడా పెడా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎప్పటికప్పుడు ఘాటైన కథనాల్ని వండి వడ్డిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమ పాలన పట్ల ప్రజల్లో అసహనం పెరగకుండా వుండాలంటే, హోంమంత్రి అత్యంత బాధ్యతాయుతంగా తాను ఇచ్చే ప్రకటనల విషయంలో వ్యవహరించాల్సి వుంటుంది.
కానీ, ఒకదాని తర్వాత ఇంకోటి.. తేలికపాటి స్టేట్మెంట్లు ఆమె ఇచ్చేస్తున్నారు. అదే వైసీపీకి శాపంగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని పలచన చేస్తోంది ప్రజల్లో. భర్త వద్ద డబ్బులు లాక్కునే ప్రయత్నంలో నిందితులు మద్యం మత్తులో, అక్కడే ఆ భర్తతో వున్న భార్య మీద దాడి చేసేశారుగానీ.. రేఫ్ చేయాలనే ఆలోచన అంతకు ముందు వారికి లేదు.. అంటూ నిందితులకు వత్తాసు పలుకుతున్నట్లుగా హోంమంత్రి తానేటి వనిత వ్యాఖ్యానించారన్నది విపక్షాల విమర్శ.. టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారం.
ఓ మహిళ హోంమంత్రి అయి వుండీ, ఇంత తేలిగ్గా ఎలా వ్యవహరిస్తారన్న చర్చ జన బాహుళ్యంలో జరగకుండా వుంటుందా.?