బిగ్ బాస్ షో కోసం వెర్రెత్తి చూసే జనాలు ఒకపక్క ఉంటే… ఆ షోని టీవీల్లో టెలీకాస్ట్ చేయడంపై దుమ్మెత్తి పోసేవాళ్లు మరింకొందరు. ఈ సమయంలో బిగ్ బాస్ షో ని బ్రోతల్ హౌస్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించే సీపీఐ నారాయణ లాంటి వారు మరికొంతమంది. ఈ క్రమంలో హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును… బిగ్ బాస్ రియాల్టీ షో విషయంలో మరోసారి చర్చ మొదలైంది. గత నవంబర్ లో వేసిన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) విచారణకు రాగా ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ సందర్భంగా… ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రసారం కావట్లేదని, దీనిపై విచారణ అర్థం లేనిదని.. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్ వేయడానికి పిటిషనర్ కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తరపు న్యాయవాది!
ఇదే సమయంలో ఇప్పుడు బిగ్ బాస్ కు సెన్సార్షిప్ వివాదం ఎందుకని వాదించారు స్టార్ ఇండియా మాటీవీ తరపు న్యాయవాదులు. ఇదే సమయంలో కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ చట్టం ప్రకారం.. ప్రసారానికి ముందే సెన్సార్ షిప్ కి అవకాశం లేదని, సెన్సార్ కావాలంటే కేంద్రం ప్రత్యేకంగా చట్టం చేయాల్సిందేనని అన్నారు.
అనంతరం బిగ్ బాస్ షో విషయంలో మరిన్ని కీలక వాదనలు వినిపించారు. బిగ్ బాస్ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్ మార్చుకోవచ్చని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల న్యాయస్థానం జోక్యం చేసుకునే పరిధి తక్కువ అని వివరించారు.
వాస్తవానికి బిగ్ బాస్ లో అశ్లీలత డోసు ఎక్కువగానే ఉంటుందనేది వాస్తవం. కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్ చేయలేరనేది కూడా వాస్తవం.. అలాంటి చట్టం కూడా లేకపోవడం వారి లక్ అనేది మరో వాస్తవం! ఈ లొసుగుని అడ్డు పెట్టుకునే బిగ్ బాస్ ప్రసారం విషయంలో టీవీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందనేది ఇంకా పెద్ద వాస్తవం!
ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం కేబుల్ టీవీలో ప్రసారమయ్యే ప్రోగ్రాంస్ కి ముందుగానే సెన్సార్ చేయాలనే చట్టాలు లేవు. కాకపోతే ప్రసారం తర్వాత అభ్యంతరకర సన్నివేశాలుంటే చట్టప్రకారం ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు వ్యవహారం తేలినా, తేలకపోయినా.. ఇక్కడ ప్రసారం మాత్రం ఆగదు! సరిగ్గా ఇదే విషయాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ షో లాంటి కార్యక్రమాలపై వరుస ఫిర్యాదులు అందుతున్న సందర్భాల్లో ప్రసారానికి ముందే సెన్సార్ షిప్ చేయకపోతే ఎలా అని ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. ప్రసారం అయిపోయాక దానిపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం “పోస్టుమార్టం” చేయడం లాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో ప్రస్తుతం బిగ్ బాస్ షో ప్రసారం కావడం లేదన్నంత మాత్రాన కోర్టు కళ్లు మూసుకుని ఉండలేదని పేర్కొన్న హైకోర్టు… ఈ మేరకు కేంద్రానికి తగిన సూచనలు ఇస్తామని తెలిపింది.
అనంతరం… కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, స్టార్ ఇండియా మాటీవీ, ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్, సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.