“1000 ఎకరాల బంధం”!… గన్నవరం విమానాశ్రయానికి రామోజీ పేరు!?

తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతుందని తెలుస్తోంది. తనకూ రామోజీరావుకూ ఉన్న బంధానికి ఆయన మరణానంతరం ఏదో చేయాలని చంద్రబాబు తపిస్తున్నారని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన రెండు కీలక ఆలోచనలు చేశారని.. త్వరలో వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే… టీడీపీ అధినేత నారా చంద్రబాబుకు – దివంగత ‘ఈనాడు’ అధిపతి చెరుకూరి రామోజీరావుకూ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1983 కాలంలో నందమూరి తారకరామారావు కోసం అహర్నిశలు పనిచేశారనే పేరు సంపాదించుకున్న రామోజీ.. తదనంతరకాలంలో ఆయనను కుర్చీలోనుంచి దింపడంలోనూ కీలక భూమిక పోషించారనే కామెంట్లను సొంతం చేసుకున్నారని అంటుంటారు.

ఇక తదనంతరం చంద్రబాబుకు ఆయనకూ మధ్య బంధం విడదీయరాని స్థాయికి చేరుకుందని పలువురు చెబుతుంటారు. అందుకు కారణం ఫిలింసిటీ భూములు అనేది చాలా మందికున్న అవగాహన! వాస్తవానికి ఫిలింసిటీ ఆలోచన రామోజీ 1980ల్లోనే చేశారని.. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా పలు స్టూడియోలను ఆయన సందర్శించి, పరిశీలించారని చెబుతుంటారు.

ఆ సమయంలో ఆయన 1000 ఎకరాలు కావాలని.. అది కూడా హైదరాబాద్ సరిహద్దుల్లోనే ఇప్పించాలని ఎన్టీఆర్ ముందు ప్రపోజల్ పెట్టారట రామోజీరావు. అయితే… ప్రభుత్వ భూములు అంటే, అవి ప్రజల ఆస్తి, అలా నీకు ఒక్కడికే 1000 ఎకరాలు ఇస్తే అంతకు మించి ప్రజాద్రోహం ఉండదు అని తేల్చి చెప్పారని అంటుంటారు.

దీంతో… అప్పటి నుంచి “టార్గెట్ ఎన్ టీఆర్” అనే ఆపరేషన్ ను రామోజీ రావు స్టార్ట్ చేశారని అంటుంటారు. ఫలితంగా అప్పటివరకూ ఇంద్రుడూ చంద్రుడూ అని రాసిన చేతులే… స్త్రీలోలుడు, ప్రజా భక్షకుడు అనే స్థాయి రాతలు రాయడానికి తెగించాయని అంటుంటారు. అయితే… ఇందులోని వాస్తవాస్తవాలు దాదాపుగా ఎవరికీ తెలియకపోవచ్చు. ఇప్పుడు ఇద్దరూ స్వర్గస్తులైన పరిస్థితి!

కాకపోతే.. రామోజీ రావు చేసిన ప్రతిపాదనకు చంద్రబాబు మాత్రం అంగీకరం తెలిపారని.. అందువల్లే పెద్దాయనను దింపి చంద్రబాబు ఆ కుర్చీలోకి ఎక్కగలిగారని అంటుంటారు. ఫలితంగా చంద్రబాబు సీఎం అవ్వగానే క్షణాల్లో 1000 ఎకరాలకూ అనుమతులు ఇచ్చేశారని చెబుతుంటారు. నాటి నుంచి చంద్రబాబు, రామోజీ రావు బంధం ముందు ఫెవికాల్ చిన్నది అయ్యిందని అంటుంటారు.

ఈ నేపథ్యంలోనే 2014 సమయంలో చంద్రబాబును గద్దెనెక్కించడంలో ఈనాడు కీలక భూమిక పోషించిందని చెబుతుంటారు. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విపరీతంగా తెగించి ముందుకు కదిలిందని.. ఈ విషయంలో వెనకా ముందూ చూసుకోలేదని.. అసత్యాలు రాసినా అడిగేవాడెవడు అన్నట్లుగా చెలరేగిపోయిందని అంటుంటారు.

ఆ సంగతి అలా ఉంటే… రామోజీరావు రుణం ఎంత తీర్చుకున్నా తీరదని బాబు భావిస్తున్నారనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో… విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీ పేరు పెట్టాలనే ఆలోచనలో బాబు ఉన్నారని.. ఇదే సమయంలో… గుడివాడ నియోజకవర్గానికి కూడా ఆయన పేరు పెట్టాలని ఫిక్సయ్యారని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో రామోజీరావు విమానాశ్రయం.. రామోజీ గుడివాడ నియోజకవర్గం.. అని త్వరలో అధికరికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.