ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు & కో భారీ ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సూపర్ 6 పథకాలు పక్కాగా మొదటి నెల నుంచీ అమలు చేస్తారని చాలా మంది ఆశాజీవులు భావించారు.. కానీ బాబు మార్కు హామీల గురించి తెలిసిన వారు పునరాలోచించారు. అయితే… వారి పునరాలోచనకే బలం చేకూర్చేలా బాబు ప్రవర్తన ఉందని అంటున్నారు!
అవును… సూపర్ సిక్స్ హామీలు అంటూ చంద్రబాబు నాయుడు ప్రజలను ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత ప్రయాణం.. 18 ఏళ్లు దాటిన ప్రతిమహిళకు నెలకు రూ.1500.. తల్లికి వందనం కింద ప్రతీ బిడ్డకూ రూ.15,000.. నిరుద్యోగభృతి నెలకు రూ.3,000 అంటూ చెప్పుకొచ్చారు.
అయితే… కుర్చీ ఎక్కిన తర్వాత ఆ హామీల అమలుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. మరోపక్క మహిళలు ఎంతో ఆశపడిన పథకాలపై కూటమి సర్కార్ తమ అనుకూల మీడియా ద్వారా నెమ్మదిగా నీళ్లు చిలకరించే ప్రయత్నం చేస్తుందనే చర్చ ప్రజానికంలో మొదలైందని అంటున్నారు. తాజాగా తెరపైకి వచ్చిన కొన్ని కీలక విషయాలు, ఎగ్గొట్టే ఎత్తుగడలూ ఈ విషయానికి బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు.
ఇందులో భాగంగా… చంద్రబాబు రవాణా శాఖ వ్యవహారాలపై సమీక్ష నేపథ్యంలో అసలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారనే విషయంపై నిర్ధిష్టంగా ఒక తేదీ చెప్పగల స్థితిలో ఈ ప్రభుత్వం ఉనదా అనే అనుమానాలు ప్రజల్లో బలంగా కలుగుతోంది. చేయాలనుకుంటే ఇంత సమయం అవసరం లేదు కదా అనేది సామాన్యుల ప్రశ్న. ఆర్థిక పరిస్థితి కబుర్లు చెబితే.. ముందు తెలియదా అనే మరో పెద్ద ప్రశ్న!
చేయాలనే మనసు ఉందా.. లేక, గతంలో లాగానే మేనిఫెస్టోకు మంగళం పాడి, చివర్లో పసుపు – కుంకుమ తరహా పాలిటిక్స్ చేయాలనుకుంటున్నారా అనేది ఆసక్తిగా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ అమలుకు మరింత కాలం పట్టొచ్చని అంటున్నారు. పైగా… దీనికి చాలా టెరంస్ అండ్ కండిషన్స్ ఉన్నాయని చెబుతున్నారు.
ఈ మేరకు ఈ హామీ అమలుకు సంబంధించి అధికారులు నివేదిక తయారుచేసినట్టు చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఈ హామీ అమలు కావాలంటే… ఆర్టీసీకి ఇంకా రెండు వేల బస్సులు కావాలని, సుమారు మూడున్నర వేల మంది డ్రైవరు పోస్టులు భర్తీ చేయాలని నివేదిక సిద్ధమైనట్లు కథనాలొస్తున్నాయి. అంటే… అవన్నీ అయ్యాకే హామీ అమలు ఆలోచన అన్నమాట.
అంటే… కొత్త బస్సులు కొని, పాతవి రిపేర్ చేయించి, రంగులు వేసి, కొత డ్రైవర్ పోస్టులను భర్తీ చేసి అప్పుడు ఈ హామీ అమలుపై ఆలోచన చేస్తారా అనే సందేహాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అదే నిజమైతే… కనీసం మరో ఆరునెలల కాలం వరకు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేసే అవకాశాలున్నాయని.. అందులో భాగంగానే ఈ నివేదికలు అనే చర్చా మొదలైంది!