శ్రీవారి కృపకు కృతజ్ఞతగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం ఉదయం పవన్ సతీమణి అన్నా లెజినోవా కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తలనీలాలు సమర్పించడం, అన్నదానం చేయడం వంటి సంప్రదాయాలను పాటిస్తూ పవన్ కుటుంబం వినయపూర్వకంగా మొక్కులు తీర్చుకుంది.
ముఖ్యంగా ఇటాలియన్ పౌరురాలైన అన్నా, తిరుమల నియమాలు ఖచ్చితంగా పాటించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో స్వల్ప గాయాలపాలైన పవన్ కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవడాన్ని శ్రీవారి కృపగా భావించిన కుటుంబం తిరుమలలో ప్రత్యేక మొక్కు చెల్లింపుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించింది.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో రూ.17 లక్షల విరాళంతో భక్తులకు భోజనం ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. “ఈరోజు భోజన దాత: కొణిదల మార్క్ శంకర్ – విరాళం: ₹17,00,000” అనే ప్రకటన బోర్డుపై ప్రదర్శించబడింది. అన్నా లెజినోవా భూవరాహ స్వామి దర్శనం, తలనీలాలు సమర్పణ, గాయత్రి నిలయం అతిథిగృహంలో బస వంటి అన్ని దైవదర్శనం ప్రోటోకాల్ ప్రక్రియను పాటిస్తూ మూడురోజుల పర్యటనలో ఉండనున్నారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని భక్తులతో కలిసి భోజనం చేశారు.