ఇండియా పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వేళ, పలువురు దీనిపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆయన చేసిన కామెంట్ కేవలం రీట్వీట్లు, లైక్స్‌ను మాత్రమే కాదు… జాతీయ స్థాయిలో చర్చలకు దారి తీస్తోంది.
తమిళ తాత్విక కవి తిరువళ్లువార్ తిరుక్కురల్ రచించిన “తిరుక్కురల్”లోని 763వ పద్యాన్ని పవన్ షేర్ చేశారు. పాన్ ఇండియా తరహాలో ప్రముఖ భాషల్లో ఈ ట్వీట్ వేయడం విశేషం. “ఎలుకలన్నీ సముద్రంలా గర్జించినా, శేషనాగు ఒక్కసారి హుంకరిస్తే చాలు.. అవన్నీ నశిస్తాయి” అన్న అర్థంతో ఆయన చేసిన వ్యాఖ్య పాక్ పై సూటిగా పడింది.
ఈ పద్యంలోని ఎలుకలు అనే పదాన్ని పాక్ ఉగ్రవాద శక్తులుగా చెప్పగా, శేషనాగుని భారత్ సైనిక శక్తిగా పోల్చారు. ఈ ట్వీట్‌కు ఆర్థిక, రక్షణ, రాజకీయ రంగాల నుంచి భారీ స్పందన వచ్చింది. ‘#OperationSindoor’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసిన పవన్, భారత రక్షణ వ్యవస్థపై తన గర్వాన్ని వ్యక్తం చేశారు. ఇందులో ప్రత్యేకంగా S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థకు సంబంధించిన కళాత్మక చిత్రాన్ని జతచేసి, భారత శక్తిని ప్రాతినిధ్యం చేశారు. ఆ చిత్రంలో బహుశిరోదసి సర్పం రూపంలో భారత్ రాడార్ వ్యవస్థను చూపించగా, పక్కనే చిన్న ఎలుకలు తరలిపోతున్నట్లు చూపడం విశేషంగా నిలిచింది.
ఈ ట్వీట్‌పై పాన్ ఇండియా స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. పాకిస్థాన్ పౌరులు కూడా దీన్ని రెస్పాండ్ చేయడం ప్రారంభించగా, భారతీయ నెటిజన్లు పవన్ ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. సోషల్ మీడియాలో “జై శేషనాగ్”, “జై పవన్” అన్న ట్రెండ్‌తో రిప్లైలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలకే పరిమితమని భావించిన పవన్ కామెంట్లు, దేశ రక్షణ వ్యవహారాలపై కూడా ఆయన స్పష్టమైన ఆలోచనలున్నాయన్న అభిప్రాయాన్ని కలిగించాయి.