ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఫస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందా? అనిపించే ఉదంతం ఇది. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న ఘటన ఇది. తన కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై ఆయన కన్నెర్ర చేశారు. ఓ మహిళా కార్యకర్తను ఉద్దేశించి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
జన్మభూమి-నా ఊరు కార్యక్రమంలో పాల్గొనడానికి చంద్రబాబు ఈ ఉదయం కాకినాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తదితరులు ఉన్నారు. కాకినాడలో కాన్వాయ్ ప్రవేశించిన తరువాత కొంతమంది బీజేపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తోన్న బస్సును అడ్డుకున్నారు. పోలవరం సహా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పలు ప్రాజెక్టులు, పథకాల్లో అవినీతి పెచ్చరిల్లిందంటూ నినాదాలు చేశారు.
ఇలా నినాదాలు చేసిన వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బస్సు ఆగిపోవడంతో తొలుత ఉప ముఖ్యమంత్రి కిందికి దిగారు. ఆయన వెనకాలే చంద్రబాబు బస్సు డోరు తెరుచుకుని బయటికి వచ్చారు. కిందికి దిగ లేదు. బీజేపీ కార్యకర్తలను బెదిరించారు.
`ఏం కావాలమ్మా మీకు. మీ మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. బయటికి వస్తే పబ్లిక్ మిమ్మల్ని వదిలి పెట్టరు. జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ తరఫున వచ్చి, నన్నే బెదిరిస్తారా. మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశారు. కొంచెమైనా మీకు సిగ్గుందా. నాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు. మర్యాదగా ఉండు. నీకు చాలా సమస్యలు వస్తాయి..` అని హెచ్చరించారు. ఎవరు ఎవర్ని మోసం చేశారో ప్రజలకు తెలుసు అంటూ ఆ మహిళ మాట్లాడటానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడే ఉన్న చినరాజప్ప ఆమెను వారిస్తూ కనిపించారు.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓ జాతీయ పార్టీ మహిళా కార్యకర్తలను బహిరంగంగా బెదిరించడం విమర్శలకు దారి తీస్తోంది. ముఖ్యమంత్రి బెదిరింపుల పట్ల రాష్ట్ర బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రజల్లోకి వెళ్తామని అంటున్నారు.