ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంక్రాంతి పండుగ మరింత ప్రత్యేకం అయ్యేలా చేసింది ఏపీ ప్రభుత్వం. పండుగ ముగిసిన మూడు రోజుల్లోనే ఏపీ ప్రజల జీవితాల్లో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు తన సొంతూరు నారావారిపల్లెలో మాట్లాడారు. ప్రజలందరికీ 150కి పైగా సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు. ఈ సేవలలో ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, భూమి సంబంధిత పత్రాలు వంటి పలు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇకపై ఈ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రజలు వాట్సాప్ ద్వారానే పొందగలరని తెలిపారు. ఐటీ రంగంలో తన విశేష శ్రద్ధను చూపిస్తున్న నారా లోకేష్ దీనికి ఆధారంగా నిలిచారు. లోకేష్ ప్రతిపాదన మేరకు మెటా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం, ప్రజలకు సేవల బదిలీ ప్రక్రియను వేగవంతం చేసింది.
ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రజలు గవర్నమెంట్ సేవల వినియోగాన్ని మరింత సులభతరం చేసుకోగలరని భావిస్తున్నారు. ప్రజల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, గవర్నెన్స్ విధానాలను సాంకేతికతతో కలిపి కొత్త దశకు తీసుకువెళ్ళాలన్న చంద్రబాబు ఉద్దేశ్యం ఈ పథకంలో కనిపిస్తోంది. సంక్రాంతి సందర్బంగా ఈ ప్రకటన ప్రజల హృదయాలను హత్తుకుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ వినూత్న ప్రయోగం ఏపీ ప్రభుత్వానికి టెక్నాలజీ దిశగా మరింత పేరును తీసుకురావడమే కాకుండా, ప్రజల జీవన ప్రమాణాలను అమూలంగా మార్చుతుందని చెప్పవచ్చు.