తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎదురుదాడి చేయటం బాగా తెలుసు. తాను తప్పులను చేస్తూ, అవే తప్పులు ప్రత్యర్థులు చేస్తున్నారని మభ్య పెట్టగలడంలో దిట్ట. తన శతృవులు, రాజకీయ ప్రత్యర్థులు ఎంతటి వారైనా సరే! సమాన దృష్టితో చూస్తుంటారు. తాను చేసే పస లేని విమర్శలు, నస పెట్టే ఆరోపణలను చూసి, జనం నవ్వుకుంటారనే బాధ ఆయనకు ఏ కోశానా కనిపించదు. అది ఆయన ప్రత్యేకత.
తాజాగా ఆయన ఎలాంటి ద్వంద్వనీతిని పాటిస్తారనేది మరోసారి జనాలకు తెలిసి వచ్చింది. రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, విప్ మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ వీడటంపై చంద్రబాబు అండ్ కో చేస్తోన్న ఆరోపణలు జనాలకు నవ్వు తెప్పిస్తున్నాయి. మేడా మల్లికార్జున రెడ్డి పార్టీ వీడటం వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హస్త ఉందని వారు చెబుతున్నారు.
కేసీఆర్ వెనుక ఉండి ప్రోత్సహించడం వల్లే మేడా.. వైఎస్ఆర్‌సీపీలో చేరుతున్నారని అంటున్నారు. కేసీఆర్ మాట విని, మరికొందరు పార్టీని వీడబోతున్నారని కూడా జోస్యం చెబుతుండటం విశేషమే. ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేసీఆర్ కుట్ర పన్నారనే ప్రాపగాండ మొదలు పెట్టారు. ఇదే విషయాన్ని చంద్రబాబు అనుకూల మీడియా సైతం ప్రచారం చేస్తుండటం వింతల్లోకెల్లా వింత.
చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తోన్న గిఫ్ట్ ఇదేనంటూ దానికి ట్యాగ్ జోడించి మరీ ప్రచారం చేస్తోంది. మేడా ఎక్కడ?, కేసీఆర్ ఎక్కడ? ఇద్దరికీ సంబంధం ఉందా? అనే బేసిక్‌ను కూడా విస్మరిస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే సరికి ఇంకా ఇలాంటివి ఎన్ని వినాల్సి వస్తుందో, చూడాల్సి వస్తుందోననే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమౌతోంది.