ఎన్నికల గడువు ముంచుకొస్తున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కలవరం పుడుతోంది. ప్రతి విషయానికీ ఆయన ఉలిక్కిపడుతున్నారు. ఫిరాయింపుల్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ అడుగు ముందే ఉండటం ఆయనలో ఆందోళనకు కారణం.
మొన్నటికి మొన్న తన కేబినెట్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బావ ప్రతిపక్ష పార్టీలో చేరడం మింగుడు పడట్లేదు. ఈలోగా- తన సొంత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ ప్రతిపక్షం వైపు చూపులు సారించడం చంద్రబాబుకు తల కొట్టేసినంత పనైంది. అహం దెబ్బతిన్నది. అందుకే- మూలాలకు వెళ్లి మరీ దగ్గుబాటి కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య పురంధేశ్వరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు కూడా చంద్రబాబు ఇంతలా బాధపడి ఉండకపోవచ్చు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం ప్రతిపక్ష పార్టీలో చేరిందని, ఆ కుటుంబం మారని పార్టీలు లేవని చంద్రబాబు విమర్శిస్తున్నారు.
ఈ ఆరోపణల్లో ఎలాంటి పస లేదనే విషయం చంద్రబాబుకూ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఎంతమంది ఎన్ని పార్టీలను ఫిరాయించలేదు? దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎన్ని పార్టీలు ఫిరాయించారో చంద్రబాబుకూ తెలుసు. అంతెందుకు? చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని వీడి, తెలుగుదేశంలోకి చేరడం అధికారం కోసం కాదా? ఆ అధికారం కోసమే కదా! పార్టీ మొత్తాన్నీ తీసుకెళ్లి కాంగ్రెస్ పాదాల వద్ద ఉంచింది.
కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి బీజేపీలోకి వెళ్లారని చంద్రబాబు చేసిన ఇంకో విమర్శ కూడా ఏ మాత్రం పస లేనిదే. తాజాగా- తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్న కర్నూలు మాజీ లోక్‌సభ సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పేరును కూడా ఈ జాబితాలో చేర్చవచ్చు. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయనను ఎందుకు చంద్రబాబు తన వద్ద చేర్చుకుంటున్నట్టు? ఆయనా కేంద్రమంత్రిగా పనిచేసిన నాయకుడే కదా!
దగ్గుబాటి కుటుంబాన్ని విమర్శించే క్రమంలో.. చంద్రబాబు ఏ పేరునైతే తలచుకోవడానికి కూడా ఇష్టపడరో.. అదే పేరును ఉచ్ఛరించారు. ఆ పేరే లక్ష్మీపార్వతి. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైఎస్ఆర్ సీపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అవకాశవాద రాజకీయాల కోసం లక్ష్మీపార్వతి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అప్పట్లో ఎన్టీఆర్‌ను వాడుకున్నారనీ చెప్పుకొచ్చారు.
ఎన్టీఆర్ ఎపిసోడ్ గురించి చంద్రబాబు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. లక్ష్మీపార్వతిని బూచిగా చూపే కదా! చంద్రబాబు ఆ మహానాయకుడిని పదవీచ్యుతుడిని చేసింది. వారంతా ప్రతిపక్ష వైఎస్ఆర్ గూటికి చేరి, ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు ఆక్రోశం.
ఇలా ఎక్కడికక్కడ పొంతన లేకుండా చంద్రబాబు ఆరోపించడాన్ని బట్టి చూస్తోంటే.. ఆయన ఏ స్థాయిలో ఆందోళనకు గురవుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పెద్దగా బుర్రను ఉపయోగించాల్సిన పని ఉండదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం చంద్రబాబుకు ఏ మాత్రం నచ్చని విషయం.
తనకు నచ్చినదేదైనా సరే! దానిపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం ఆయన నైజం. ఆ అర్థం లేని ఆరోపణలను తన అనకూల మీడియాతో జనంలోకి తీసుకెళ్లడం ఆయనకు బాగా తెలిసిన విద్య. అందుకే- పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీలో ముసలం పుట్టిందంటూ వార్తలు వస్తున్నాయి.