ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తన కుమారుడు, మంత్రి లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం ఇష్టం లేదా? రాజకీయాల్లోకి రావొద్దని ముందే సూచించారా? అంటే అవుననే అనుకోవాలి. ఎందుకంటే- ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే వెల్లడించారు కాబట్టి. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో సోమవారం జరిగిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం సందర్భంగా ఈ విషయాన్ని బయట పెట్టారాయన.
తన కుమారుడు లోకేష్ రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని అన్నారు. చేతిలో ఉన్న కంపెనీలను చూసుకోవాలని సూచించానని చెప్పారు. అయినప్పటికీ- లోకేష్ వినలేదని, ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తానని కోరాడని అన్నారు. ప్రజా సేవ చేయాలనే సత్సంకల్పం ఉండటంతో తాను స్వాగతించానని చంద్రబాబు అన్నారు. అలాంటి తన కుటుంబంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.
తన కుటుంబ సభ్యులు హెరిటేజ్ సంస్థను ఓ పద్ధతి ప్రకారం నడిపిస్తున్నారని, క్రమ శిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ప్రజా సేవ కోసం వచ్చిన తన కుమారుడిపై ప్రధాని విమర్శలు చేయడం సరికాదని ఆయన చెప్పారు.
తన కుమారుడి ఎదుగుదల కోసం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారంటూ ప్రధాని విమర్శించిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ఆయనపై ఎదురుదాడి చేశారు. తనకు ప్రధాని కావాలన్న కోరిక ఏ మాత్రం లేదని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నందుకే కాంగ్రెస్‌తో కలిశామని అన్నారు. అదృష్టం కలిసొచ్చి మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు.