చంద్రబాబే ప్రధాన నిందితుడు… లోకేష్ పై సీఐడీ కీలక వ్యాఖ్యలు!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును ఏపీ సీఐడీ చీఫ్ సంజ‌య్ నిర్ధారించారు. శ‌నివారం ఉద‌యం 6 గంట‌ల త‌ర్వాత చంద్రబాబు అంగీకారం మేర‌కు ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టు చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో దాదాపు రూ.550 కోట్ల వరకు అవినీతి జరిగిందని సీఐడీ చీఫ్ వెల్లడించారు.

స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ స్కాంలో నకిలీ ఇన్‌ వాయిస్‌ ల ద్వారా షెల్‌ కంపెనీకి నిధులు మళ్లించారని ఏపీ సీఐడీ చీఫ్ తెలిపారు. వీటికి సంబంధించి అక్రమంగా జరిగిన అ‍న్ని లావాదేవీల గురించి చంద్రబాబుకు తెలుసని, ఈ విషయాలపై చంద్రబాబును ప్రశ్నించాల్సి ఉందని.. అందుకే చట్టపరంగా అన్ని చర్యలు తీసుకునే అరెస్ట్‌ చేశామని సంజయ్ తెలిపారు!

ఇదే సమయంలో ఇదేదో అక్రమ అరెస్ట్ కాదని.. అరెస్టు ప్రక్రియ అంతా చట్టప్రకారమే జరిగిందని.. చంద్రబాబు అంగీకారంతోనే అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ చీఫ్ తెలిపారు. ఇదే క్రమంలో చంద్రబాబు హోదాను, ఆయ‌న వ‌య‌సును దృష్టిలో పెట్టుకునే ప్రశ్నించ‌నున్నట్టు సీఐడీ చీఫ్ చెప్పారు. అనంతరం నారా లోకేష్ పైనా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును… స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కులో నారా లోకేష్ పాత్రపైనా నిశితంగా దృష్టి పెట్టిన‌ట్టు ఏపీ సీఐడీ చీఫ్ చెప్పారు. కేవ‌లం స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కేసులోనే కాకుండా.. ఫైబ‌ర్ నెట్‌, అమ‌రావ‌తి రింగ్ రోడ్డు ఎక్స్‌టెన్షన్ వంటి కేసుల్లోనూ నారా లోకేష్ పాత్ర ఉంద‌ని, దీనిపై నిశితంగా ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌ని అన్నారు. అన్ని కేసుల్లోనూ లోతుగా విచారించిన త‌ర్వాత ఆయ‌న అరెస్ట్‌ పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు!

ఇదే సమయంలో చంద్రబాబు అరెస్టు అక్రమం కాదని, అనివార్యమైన అరెస్టు మాత్రమే అని ఏపీ మంత్రీ అంబటి రాంబాబు చెబుతున్నారు. అరెస్టు చేయటం వలన సింపతి వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా చూసిందని.. దీన్ని కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారని.. అయితే అలాంటివి ఏవీ జరగలేదని అన్నారు. అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు.

#@AK Bharath News స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ప్రధాన నిందితుడు : ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్