కూటమిలో కుంపటి… ఆ 10 మందిలో సగంమందికి ఎన్నికలకు ముందే…!!

రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీట్ల సర్దుబాటు పూర్తయినప్పటికీ.. నియోజకవర్గాల పంపకాల్లోనూ, అభ్యర్థుల ఎంపికలోనూ సరికొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ – జనసేనల నేతలు, కార్యకర్తలతో పలు నియోజకవర్గాల్లో ఇంటర్నల్ వార్స్ పీక్స్ కి చేరినట్లు తెలుతుండగా.. ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది!

అవును… పొత్తులో భాగంగా తమకు కేటాయించబడిన 6 లోక్ సభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ… తాజాగా 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ విషయంలో కూడా లోక్ సభ తరహాలోనే… వలస నేతలకు అధిక ప్రాధాన్యత తగ్గిందని… అయినోడికి ఆకులో, కానోడికి కంచంలో అన్నట్లుగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని పలువురు హార్డ్ కోర్ బీజేపీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.

ఇందులో భాగంగా… అనపర్తి, అరకు, ఎచ్చెర్ల, ధర్మవరం, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో కూటమిలో కుంపట్లు పీక్స్ కి చేరినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టిక్కెట్ ఇప్పుడు పిఠాపురం తర్వాత అంతటి హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి టీడీపీ తొలిజాబితాలోనే ఇక్కడ నుంచి అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించింది టీడీపీ. అప్పటి నుంచి ఆయన విస్తృతంగ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు.

అయితే… తాజా జాబితాలో ఆ స్థానంలో బీజేపీ తమ అభ్యర్థిగా శివకృష్ణంరాజుని ప్రకటించింది. దీంతో… అనపర్తిలో నల్లమిల్లి అనుచరులు రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదే విషయంపై స్పందించిన నల్లమిల్లి… ఇవాళ తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తెలిపారు. దీంతో… అనపర్తిలో పరిస్థితి ఎలా మారబోతోంది.. కూటమికి ఎలాంటి సమస్యగా మారబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

ఇదే సమయంలో అరకు వ్యాలీ విషయానికొస్తే.. ఇక్కడ గతంలోనే దొన్ను దొరను తమ అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. అయితే అనూహ్యంగా బీజేపీ తన తొలి జాబితాలో పాంగి రాజారావుని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో.. అక్కడా లొల్లి ప్రారంభమైంది. ఇదేమి పనికిమాలిన కూటమి, ఇదేమి పనికిమాలిన రాజకీయం అంటూ.. చంద్రబాబుపై ఆఫ్ ద రికార్డ్ ఫైరవుతున్నారంట టీడీపీ కార్యకర్తలు.

మరోపక్క టీడీపీ సీనియర్ నేత, చంద్రబాబుకు విశ్వాసపాత్రుడిగా పనిచేసిన పేరు సంపాదించుకున్న మాజీ మంత్రి కళా వెంకట్రావుకు బాబు దెబ్బకొట్టారు. ఈలోపు ఆయన పేరే పరిశీలిస్తున్నట్లు తన అనుకూల మీడియాలో లీకులు ఇచ్చారు. అయితే… అదంతా బుజ్జగింపులో భాగమే తప్ప వాస్తవం కాదని తెలియడానికి 24 గంటలు కూడా దాటలేదు. ఈలోపు ఎచ్చెర్ల టిక్కెట్ బీజేపీకి కేటాయించారు బాబు. దీంతో నిప్పులు చెరుగుతున్న ఆయన వర్గం.. ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలని కోరుతుందని తెలుస్తుంది.

ఇక ధర్మవరం నుంచి బీజేపీ నేత వరదాసూరి, టీడీపీ నేత పరిటాల శ్రీరాం లు టిక్కెట్లు ఆశించిన సంగతి తెలిసిందే. అయితే.. అనూహ్యంగా బాబు ఈ టిక్కెట్ బీజేపీ కేటాయించగా… అక్కడ నుంచి సత్యకుమార్ కు ఈ టిక్కెట్ దక్కింది. దీంతో… వరదాపురం సూరి నెక్స్ట్ స్టెప్ ఏమిటనే విషయం ఆసక్తి నెలకొంది. పరిటాల శ్రీరాం నిర్ణయం ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇక టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ లాంటి నేతలు ఎన్నో ఆశలుపెట్టుకున్న సీటు.. పోతిన మహేష్ ఇప్పటికీ నిరాహార దీక్ష చేస్తున్న స్థానం అయిన విజయవాడ వెస్ట్ ని సుజనా చౌదరి ఎగరేసుకుపోయారు!! దీంతో… ఇక్కడ పైన చెప్పుకున్న టీడీపీ నేతల అనుచరులు.. ప్రధానంగా పోతిన మహేష్ అనుచరులు నిప్పులు చెరుగుతున్నారని తెలుస్తుంది.

దీంతో… ఎన్నికలకు ముందే ఏపీ బీజేపీలోని 10 మంది అభ్యర్థుల్లో సగంమందికి ఫలితాలపై ఒక అభిప్రాయం వచ్చేస్తున్నట్లుందనే స్థాయి కామెంట్లు అవినిపిస్తుండటం గమనార్హం.