ఈ మధ్య కమలనాథులు కూడా పంచ్‌లు వేయడం మొదలుపెట్టారు. అదీ చంద్రబాబు మీదే. చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రెగ్యులర్ మీడియాలో తమ పంచ్‌లు పబ్లిష్ కావట్లేదని, టెలికాస్ట్ కావట్లేదని చాలా ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి ఆరంభించారు. తాజాగా- రాష్ట్ర బీజేపీ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి.
నరేంద్రమోడీని లీడర్‌గా, చంద్రబాబును డీలర్‌గా అభివర్ణిస్తూ బీజేపీ చెలరేగిపోయారు. మొన్నే నరేంద్రమోడీ గుజరాత్‌లోని హజీరాలో కే-9 వజ్ర యుద్ధ ట్యాంకును నడిపారు. ఆ ఫొటోకు లీడర్ అని ట్యాగ్ చేశారు. కోల్‌కతలో జరిగిన యునైటెడ్ ఇండియా ర్యాలీ వేదిక మీద ఉన్న ప్రతిపక్ష నేతల ఫొటోకు డీలర్ అని ట్యాగ్ చేసి, సామాజిక మాధ్యమాల్లో వదిలారు. భలేగా పేలుతోందది.
`2019లో భారతీయులు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించే నరేంద్రమోడీ నాయకత్వం కావాలా? లేక దేశాన్ని పీక్కోని తినడానికి సిద్ధమైన గజ దొంగలు ముఠా కావాలా ..? అని కామెంట్ చేశారు. అదే ర్యాలీకి హాజరైన ప్రతిపక్షాల నేతలు అల్పాహారాన్ని తీసుకుంటుండగా, వారిని ఉద్దేశించి చంద్రబాబు నిల్చుని ఏదో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్న ఫొటోను జోడించారు.
`మేతల ముఠా` నాయకులకు ప్లేట్ మీద ఉన్న శ్రద్ధ మీ మాట మీద లేదని ఎద్దేవా చేశారు. `40 ఇయర్స్ ఇండస్ట్రీ మాట్లాడుతుంటే కనీసం ఒక్క మాయ కూటమి నాయకుడు కూడా మీ మాటలు పట్టించుకోకుండా ప్లేట్ మీద ఫోకస్ పెట్టారు…! మీరా నరేంద్రమోడీగారిపై యుద్ధం చేసేది! అంటూ చురకలంటించారు.