దక్షిణాదిలో పాగా వేయాలనే భారతీయ జనతా పార్టీ కలలు కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. దక్షిణాదిలో ప్రధాన రాష్ట్రాలైన తమిళనాడు, ఏపీ, తెలంగాణల్లో బలపడటానికి భాజపా చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రాంతీయ పార్టీలతో కలవడం, ఒంటరి పోరాటం చేయడం ఇలా అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఫలితం శూన్యం. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు అడుగడుగునా బీజేపీని తిరస్కరిస్తూనే ఉన్నారు. మీరసల మాకు వద్దనే వద్దంటున్నారు. జయలలిత, కరుణానిధిల మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిన మాట వాస్తవమే. ఈ శూన్యత భవిష్యత్తు వెత్తుక్కోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. మొదట్లో అన్నాడిఎంకేను గుప్పిట్లో పెట్టుకోవాలని అనుకుంది. కానీ కుదరలేదు.
అటు పిమ్మట సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రాగానే ఆయన పక్కన వాలింది. రజనీతో మాటా మంతీ నెరుపుతూ ఆయన తమ మనిషే అన్నట్టు ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. కానీ తమిళుల భావోద్వేగాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రజనీ కమల దళాన్ని దూరం పెట్టారు. వారికీ తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చేశారు. ఇక డిఎంకే స్టాలిన్ ఎలాగూ కలవరు. అందుకే మెల్లగా అన్నాడీఎంకేను ప్రసన్నం చేసుకుని దోస్తీ మొదలెట్టింది. ఇంకో ఏడెనిమిది నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ప్లాన్ వేసుకుంది. కానీ ఈలోపు పెద్ద పొరపాటు జరిగిపోయింది.
నూతన విద్యా విధానంలో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. ఇందులో భాగంగా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలు రాష్ట్ర భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ తప్పనిసరిగా నేర్చుకోవాలనే రూల్ పెట్టింది. అసలే అమితమైన మాతృభాషాభిమానం తమిళులకు. అందుకే హిందీ తప్పనిసరి అనడాన్ని సహించలేకపోయారు. కొన్ని దశాబ్దాల క్రితమే తమిళ నాయకులు, మేధావులు హిందీ భాష ఆధిపత్యాన్ని తొక్కిపడేశారు. ఆ వారసత్వం ఇంకా తమిళులలో ఉంది. అందుకే హిందీ బలవంతాన్ని ముక్తకంఠంతో నిరసిస్తున్నారు. ఎన్నికల టైమ్ కావడంతో డీఎంకే స్టాలిన్ ఈ నిరసనను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్ళారు. ఇప్పుడు తమిళులంతా అంటున్న మాట ‘హిందీ తెరియాదు పోడా’ అంటే ‘హిందీ తెలియదు పోరా’ అని అర్థం. ఇదే ఇప్పుడు అన్ని సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్. తమిళ తంబీల ఊపు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వారికి చుక్కలేనని అర్థమవుతోంది.