తెలంగాణ కాంగ్రెస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? పార్టీలో కీలక నేత, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నారా? అంటే విశ్వసనీయవర్గాలు అవుననే జవాబు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ టికెట్ దక్కకపోవడంతో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కపోవడంపై సబిత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కారెక్కడానికి ఆమె సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా, సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు వీలుగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్యవర్తిత్వం నడిపారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీని వీడిన నేపథ్యంలో సబితా రాజీనామా కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబితా గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,227 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి 86,254 ఓట్లు రాగా సబితా ఇంద్రారెడ్డి 95,481 ఓట్లను దక్కించుకున్నారు.
సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి చేవేళ్ల ఎంపీ టికెట్ దక్కితే సబిత మంగళ లేదా బుధ వారాల్లో టిఆర్ ఎస్ లో చేరనున్నారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కాంగ్రెస్ నేతల వైఖరి మారనందునే సబితా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. కేటిఆర్ సబిత భేటికి అసదుద్దీన్ ఓవైసీ మధ్యవర్తిత్వం వహించి చర్చలు సఫలం అయ్యేలా చూశారని తెలుస్తోంది. వరుసగా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతుండడంతో తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల ముందు పెద్ద దెబ్బ తగులుతుందని అంతా చర్చించుకుంటున్నారు.
దీని పై అసదుద్దీన్ ఓవైసిని విలేఖరులు ప్రశ్నించగా ఆయన వారి పై మండిపడ్డారు. మా ఇంట్లో సమావేశం వివరాలు మీకు చెప్పాలా.. అవసరమైతే మేమే మీ కార్యాలయాలకు సమాచారం అందిస్తామని అసదుద్దీన్ ఒవైసీ విలేఖరుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదుద్దీన్ తీరు పై పలు జర్నలిస్టు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.