అధికార వైసీపీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. రోజుకొకరు లెక్కన బయటపడుతున్నారు. ఈ అసంతృప్తుల్లో కొందరు పదవులు దక్కని వారైతే కొందరు తెలుగుదేశం నుండి వలస వస్తున్న నేతలతో పొసగని వారు ఇంకొందరు. ఈ రెండు రకాలు ఒక ఎత్తైతే మూడవ రకం ఇంకో ఎత్తు. వీరు సొంత పార్టీ నేతలతోనే పొసగని వారు. ఒకే పార్టీలో ఉన్న లీడర్ల మధ్యన ఇలా విబేధాలు పొడచూపుతున్నాయంటే ప్రధాన కారణం ఆధిపత్యపోరు. ఎవరి పరిధిల్లో వారు ఉండకుండా ఒకరిపై ఒకరు పెత్తనం చేయాలనే వైఖరే అసంతృప్తులను తయారుచేస్తోంది. అయితే ఈ అసంతృప్తుల్లో మహిళా నేతలు ఎక్కువ సంఖ్యలో ఉండటం కొసమెరుపు. గత ఎన్నికల్లో జగన్ మహిళలకు పెద్ద ఎత్తున అవకాశం ఇచ్చారు. వారిలో ఎక్కువమంది మొదటిసారి ఎన్నికల్లో నిలిచినవారే. జగన్ పేరు చెప్పకుని గెలుపొందిన వీరంతా ఇప్పుడు ఆధిపత్య పోరుతో సతమమవుతున్నారు.
ఇప్పటికే ఎమ్మెల్యే విడతల రజినీకి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయటకు పొసగడం లేదని రాష్ట్రం మొత్తం తెలుసు. అలాగే ఉండవల్లి తాడికొన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి స్థానిక నేతల నుండి పోటీ భీకరంగా ఉంది. తాడికొండ మీద పట్టు సాధించాలని అటు ఎంపీ నందిగాం సురేష్, ఇటు ఎమ్మెల్సీ పందుల రవీందర్ తీవ్రంగా ప్రయతిస్తున్నారు. ఫలితంగా ఎమ్మెల్యే పలు వివాదాల్లో చిక్కుకోవాల్సి వస్తోంది. ఆమెకు సంబంధించిన ఏ విషయమూ పార్టీలో గోప్యంగా ఉండట్లేదు. చిన్న చిన్న వ్యవహారాలు కూడ పెద్ద వివాదాలైపోతున్నాయి. ఇక మరొక ఎమ్మెల్యే ఆర్కే రోజాగారికైతే ఏకంగా జగన్ రైట్ హ్యాండ్ నుండే సమస్యలు ఎదురవుతున్నాయి. వీరందరూ చాలరన్నట్టు ఇంకొక మహిళా నేత కూడ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
ఆమే అమలాపురం ఎంపీ చింత అనురాధ. గత ఎన్నికల్లో అమలాపురం లోక్ సభ నుండి ఈమె గెలుపొందారు. దివంగత మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ టీడీపీ నుండి బరిలో నిలబడినా కూడ ఆమె గెలుపొందారు. అయితే ఆ సంతోషం ఆమెకు ఎన్నో నెలలు నిలవలేదు. సొంత పార్టీలోనే పాటీదారులు తయారయ్యారు. అమలాపురం ఎమ్మెల్యే, మంత్రి పినిపే విశ్వరూప్ ఆమెకు అడ్డం తగులుతున్నారట. ఆయన ఒట్టి ఎమ్మెల్యే అయితే పర్వాలేదు కానీ మంత్రి కావడంతో జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉంటున్నారు. అగ్ర నేతల అండ పుష్కలంగా ఉంది. ఆ పలుకుబడితోనే లోక్ సభ పరిధిలో చక్రం తిప్పుతున్నారట. అంతా ఆయనే అన్నట్టు వ్యవహరిస్తున్నారట. దీంతో ఆమె వర్గం సపరేట్ అయిపోయారట. పార్టీ పనుల్లో కూడ ఆమె యాక్టివ్ గా లేరట. ప్రతి కార్యక్రమాన్ని సొంతగా చేసుకోవడమో అసలు చేసుకోకపోవడమో చేస్తున్నారట తప్ప మంత్రితో ససేమిరా కలిసేది లేదని అంటున్నారట.