అంగళ్లు కేసులో బాబుకు ముందస్తు బెయిల్‌… పూచీకత్తు ఎంతంటే…?

ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు చాలా కాలం తర్వాత ఒక గుడ్ న్యూస్ వినిపించింది. ఇప్పటివరకూ అన్ని కేసుల్లోనూ కాలం ఎదురుతన్నుతుందన్నట్లుగా ఉన్న పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఇందులో భాగంగా అంగళ్లు అల్లర్ల కేసులో బాబుకు ముందస్తు బెయిల్ దొరికింది.

అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌ పై హైకోర్టు తీర్పును శుక్రవారం వెలువరించింది. ఇందులో భాగంగా ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. అయితే దీనికోసం రూ. లక్ష పూచీకత్తు సమర్పించాలని కోర్టు పేర్కొంది. ఇప్పటికే అంగళ్లు కేసులో 79 మందికి ముందస్తు బెయిల్‌ మంజూరైంది!

కాగా.. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు అని వెళ్లిన చంద్రబాబు… అంగళ్లు కూడలి వద్ద అత్యంత దారుణమైన పరిస్థితులకు ప్రధాన కారకుడయ్యారని పోలీసులు ఈ ఏడాది ఆగస్టు 8న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలు, అందుకున్న రాయలేని మాటలకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం తరుపు న్యాయవాదులు కోర్టుకు చూపించారు.

ఈ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించగా… పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. ఇందులో భాగంగా… చంద్రబాబు ప్రోద్బలంతో దాడి ఘటన చోటు చేసుకుందని.. బాబు, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆయయన్ వాదనలు వినిపించారని తెలుసుంది.

ఈ సమయంలో ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి.. నేడు వెలువరించింది. ఇందులో భాగంగా లక్ష రూపాయల పూచికత్తుమీద ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.