నాదెండ్ల పక్కన పెద్ద గీతకు కొత్త కారణాలు!

గతకొన్ని రోజులుగా జనసైనికుల్లో ఒకటే చర్చ నడుస్తుంది. ఎన్నికల వేళ మిగిలిన విషయాలన్నీ పక్కనపెట్టిన అధినేత… నాగబాబు పదవిపై సడన్ గా ఎందుకు డెసిషన్ తీసుకున్నారు? మరీ ఆయనొక్కరికే పదవి ఇస్తే బాగోదని.. మరో ఇద్దరికి మమ అనిపించినా… పవన్ ఇలా సడన్ గా ఎందుకలా చేశారనే చర్చ బలంగా నడుస్తుంది. అయితే.. ఇందులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఒక గీతను చెరపకుండా చిన్నది చేయాలంటే ఏమిచేయాలి? సింపుల్… దాని పక్కనే మరో పెద్ద గీత గీస్తే సరిపోతుంది! ఇదే పద్దతిని జనసేన అధినేత పవన్ కూడా పాటించినట్లున్నారు.

వివరాల్లోకి వస్తే… పార్టీలో నాదెండ్ల మనోహర్ పైన సోదరుడు నాగబాబును తీసుకొచ్చి పెట్టారు జనసేనాని పవన్. ఇంతకాలం పార్టీలో నెంబర్ 2 ఎవరంటే.. నాదెండ్లనే చెప్పేవారు. అయితే ఇప్పటినుండి నెంబర్ 2 ఎవరంటే.. నాగబాబు అనే చెప్పాల్సి వస్తుంది. దీంతో… ఉన్నఫలంగా పవన్ ఎందుకిలా చేశారని అడిగితే కొత్త సమాధానం వినిపిస్తోంది!

అవును… జనసైనికుల్లో ఎప్పటికీ పవన్ ఇమేజ్ పవన్ దే అయినప్పటికీ… జనసేన నాయకుల్లో మాత్రం పవన్‌ కు మించిన ఇమేజి నాదెండ్లకు వచ్చేస్తోందట. కారణం… పవన్ చాలామంది నాయకులతో టచ్‌ లోనే ఉండరు! సినిమా షూటింగుల్లో బిజీగా ఉండటం వల్లో ఏమోకానీ… పవన్ పార్టీ ఆఫీసుకు రావడం కూడా అరుదని చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో… పార్టీ నిర్వహణ మొత్తాన్ని నాదెండ్లకే వదిలేశారు. దీంతో… పార్టీలో ఏ అవసరం వచ్చినా, స్థానికంగా ఏ స్టెప్ తీసుకోవాల్సి వచ్చినా… పవన్‌ ను కాకుండా అందుబాటులో ఉన్న నాదెండ్లతోనే మాట్లాడుతున్నారట నేతలు.

దీంతో… కొన్ని సందర్భాల్లో… సర్వం తానే అనే పద్దతిలో నాదేండ్ల కూడా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు పెరగడం, అవి పవన్ వరకూ చేరడం జరిగిందని చెబుతున్నారు. దీంతో… ఇవన్నీ అన్న నాగబాబుకు కాస్త ఇబ్బందికరంగా అనిపించాయని తెలుస్తుంది. దీంతో… పవన్ అందుబాటులో లేకపోతే నేతలు తనను కాంటాక్ట్ చేసేలా నాగబాబు స్కెచ్ చేశారని.. ఫలితంగానే తమ్ముడితో చెప్పి పదవి పొందారని అంటున్నారు.

దాంతో అన్నీ విషయాలను ఆలోచించుకున్న అనంతరం… పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్నకు ప్రమోషన్ ఇచ్చి… నాదేండ్ల పక్కన పెద్ద గీత గీసారని అంటున్నారు. సో… ఇప్పుడు పవన్ తర్వాత పార్టీలో నాగబాబే నెంబర్ 2 అవుతారు. దీంతో… పార్టీ నేతలే కాదు, ఆఖరికి నాదెండ్ల కూడా ఏ అవసరమొచ్చినా నాగబాబుతోనే మాట్లాడాలి.