ఆంధ్రప్రదేశ్ రాజకీయం.! కుక్క కాటుకి చెప్పుదెబ్బేగానీ.!

దత్త పుత్రుడు వర్సెస్ జైలు పుత్రుడు.! కుక్క కాటుకి చెప్పు దెబ్బ.! జగ్గూబాయ్.. దత్త పుత్రుడి అక్రమ సంబంధం..! ఇదీ కుక్క కాటుకి చెప్పు దెబ్బే.! వినడానికి కర్ణ కఠోరంగా తయారయ్యాయ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయ నాయకుల విమర్శలు.

ఎక్కడో ఓ చోట ఈ తరహా నిస్సిగ్గుతనానికి బ్రేక్ పడాలి.! కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అసలు ఎవరిది బాధ్యత.? ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వుండాలా.? విపక్ష నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలా.?

రాజకీయ నాయకులు ఎవరైనాసరే.. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే. ముఖ్యమంత్రి పదవిలో వున్న వ్యక్తికి బాధ్యత ఎక్కువ వుంటుంది. ప్రతిపక్ష నేతకీ బాధ్యత వుంటుంది. ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందే.

గ్రామాల్లో రచ్చబండల దగ్గర జనం ఏమనుకుంటున్నారు.? ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకీ దరిద్రం.?’ అని చర్చించుకుంటున్నారు జనం. కానీ, ఇవేవీ ప్రధాన రాజకీయ పార్టీలకు అర్థం కావడంలేదు.

‘నేను బూతులు మాట్లాడగలను.. కానీ, మాట్లాడను..’ అంటారుగానీ, జనసేనాని కూడా మాట మీద అదుపు కోల్పోతున్నారు. అదే జనసేనకు శాపంగా మారుతోంది. టీడీపీ సంగతి సరే సరి. ముఖ్యమంత్రి కూడా తన స్థాయిని మర్చిపోతే ఎలా.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమా.? ఇప్పుడున్నరాజకీయ పార్టీల్లో దేన్నీ జనం కావాలనుకోవడంలేదా.? ఈ ప్రశ్నలు తెరపైకొస్తున్నాయ్. అది ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రమాద ఘంటిక. అందరూ నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందే.

లేదంటే, ఈ నిస్సిగ్గు రాజకీయ కాటుకి.. జనం ఓటుతో చెప్పు దెబ్బ కొట్టేలా వున్నారు.!