పదో తరగతి పరీక్షలపై ఇంకా ఈ మొండిపట్టుదల ఎందుకు.?

is-ys-jagan-dream-comes-true

is-ys-jagan-dream-comes-true

దేశంలో ప్రతి ప్రముఖుడినీ ట్యాగ్ చేస్తూ ఆంధ్రపదేశ్‌కి చెందిన పదో తరగతి విద్యార్థులు తమ గోడు వెల్లగక్కుకుంటున్నారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు స్పందించాలని కోరుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా వున్న నేపథ్యంలో తాము పదో తరగతి పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ అవలేకపోతున్నామనీ, ప్రస్తుత పరీస్థితుల్లో ధైర్యంగా పరీక్షలు రాయలేమని వాపోతున్నారు. అయినాగానీ, రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోతోంది. ‘సమీక్ష తర్వాతే పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై నిర్ణయం..’ అంటూ తాజాగా మరోమారు ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు.

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ డెడ్ లైన్ పెట్టిన దరిమిలా, ఈ వ్యవహారాన్ని కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్నట్లుంది మంత్రి సురేష్ వ్యవహార శైలి. నిజానికి, దేశంలో చాలా రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల్ని రద్దు చేశాయి. జాతీయ స్థాయిలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. మరి, ఆంధ్రపదేశ్‌లో మాత్రమే పదో తరగతి పరీక్షలు ఎందుకు జరగాలి.? పైగా, రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ అత్యంత భయానకంగా పెరుగుతోంది. అయినాగానీ, రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చే పరిస్థితి కనిపించడంలేదు.

టీడీపీ మాత్రమ కాదు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు.. ఇలా అన్ని రాజకీయ పార్టీలకూ విద్యార్థుల మనోవేదన అర్థమవుతోంది. కానీ, ప్రభుత్వ పెద్దలకు మాత్రం విద్యార్థుల ఆవేదన అర్థం కావడంలేదు. ఇప్పటికే కరోనా బారిన పడ్డారు కొందరు విద్యార్థులు. ‘కరోనా బారిన పడి వైద్య చికిత్స తీసుకుంటున్నాం.. మేం పరీక్ష రాయలేం..’ అని కొందరు విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా వీడియోలు పెడుతున్నారు. నిజానికి, విద్యార్థుల ఆవేదన ప్రభుత్వానికి అర్థం కాదని అనుకోలేం.

ఇలాంటి విషయాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా సున్నితంగానే వ్యవహరిస్తారు. కానీ, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వున్నట్లే కనిపిస్తోంది. ఆ కారణంగానే విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు గురవ్వాల్సి వస్తోందేమో. విషయాన్ని ఇంకా సాగదీస్తే, విద్యార్థి లోకంలో తలెత్తే అసహనం, ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారొచ్చు.