వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామలపై ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె సినీ, టీవీ రంగాల్లోకి రాకముందు కొన్ని వేదికలపై చేసిన డ్యాన్సుల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. “రికార్డింగ్ డ్యాన్సులు, టైరు బళ్లపై డ్యాన్సులు” అంటూ ట్రోలర్లు వివిధ వ్యాఖ్యలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే, దీనిపై శ్యామల తనదైన శైలిలో స్పందిస్తూ, ట్రోలింగ్‌ను మరో కోణంలో మార్చేశారు.
“మీరు నాపై చూపిస్తున్న అపారమైన ప్రేమకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం కష్టపడి ఎదిగాను. మీరు నా బాల్యాన్ని గుర్తు చేయడానికి చేసిన శ్రమను మాటల్లో చెప్పలేను. నా జీవితంలోని చిన్న చిన్న జ్ఞాపకాలను మళ్లీ నాపై ఒంపినందుకు ధన్యవాదాలు” అంటూ శ్యామల వ్యంగ్యంగా స్పందించారు.
తన చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాలను, కుటుంబ పోరాటాన్ని ప్రస్తావించిన ఆమె, ట్రోలింగ్ చేస్తున్న వాళ్లకు బదులుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాకుండా, వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలను కూడా స్వయంగా షేర్ చేయడం గమనార్హం. “మీ ప్రేమ, ఆదరణ, నమ్మకానికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ తన స్పందనను ముగించారు.
శ్యామల సమాధానం చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా, మరికొందరు ట్రోలింగ్‌కు సరైన సమాధానం ఇచ్చారంటూ ప్రశంసిస్తున్నారు. ఏదేమైనా, సోషల్ మీడియాలో నెగటివిటీకి ఆమె ఇచ్చిన సున్నితమైన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.