టీడీపీలో కొత్త పంచాయతీ పెట్టిన ఆనం!

వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు ఆనం. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ఎక్కడ నుంచి ఆదేశిస్తే అక్కడినుంచి పోటీ చేస్తాను అంటూనే చిన్న మెలిక పెట్టారు. ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. దీంతో… ఇంకా పార్టీలోకి రాకముందే పంచాయతీ పెట్టేస్తున్నారంటూ కామెంట్లు వినబడుతున్నాయి.

రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు తాను పోటీ చేస్తానని తెలిపారు. ఇక, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన ఆనం… ఈ ఏడాది చివరలోనే ముందస్తు ఎన్నికలు ఉంటాయని జోస్యం చెప్పారు. ఇదేసమయంలో… ఎన్నికల ముందు వైసీపీలోని 60 శాతం మంది టీడీపీలో చేరిపోతారని చెప్పుకొచ్చారు.

అయితే వచ్చే ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, నెల్లూరు రూరల్ సీట్లు తమ కుటుంబానికి కేటాయించాలని చంద్రబాబును అడిగినట్టు టాక్ నడుస్తోంది. నెల్లూరు రూరల్ నుంచి తనకు, ఆత్మకూరు నుంచి తన కుమార్తె కైవల్యారెడ్డికి టీడీపీ తరఫున టిక్కెట్లు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే కొత్త పంచాయతీకి కారణం అని అంటున్నారు తమ్ముళ్లు. కారణం… ప్రస్తుతం నెల్లూరు రూరల్ కు వైసీపీ నుంచి ఆనంతో పాటు సస్పెండ్ అయిన మరో నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు టిక్కెట్ ఇస్తే తాను నెల్లురు రూరల్ నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే చాలాసార్లు ప్రకటించారు. స్థానిక టీడీపీ నేతలతో అంతగా కలవకపోయినా… ఇతర జిల్లాల్లోని టీడీపీ నేతలతో సఖ్యత మెయింటైన్ చేసే పనులు కూడా మొదలుపెట్టేశారు. దీంతో… ఇదే సీటును ఆనం కూడా తన కుమార్తె కోసం అడగడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో నెల్లూరు టీడీపీ నేతలు భయపడినట్లుగానే… కొత్త పంచాయతీలు, క్యాడర్ లో కంఫ్యూజన్ క్రియేట్ చేసే రాజకీయాలు మొదలుపెట్టేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.

మరి ఈ సీనియర్ నేత, టీడీపీలో ఇంకా ఎలాంటి టెన్షన్ వాతావరణం సృష్టిస్తారు.. తనతో పాటు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటంరెడ్డి ని ఇంకెంత ఆందోళనకు గురిచేస్తారు.. ఫలితంగా నెల్లూరు టీడీపీ కార్యకర్తల్లో మరెంత కొత్త అనుమానాలు క్రియేట్ చేస్తారనేది వేచి చూడాలి.