మస్ట్ రీడ్: అన్నీ ఉన్నా టీడీపీలో అదొక్కటే లేదు!

అన్నీ ఉన్నా ఏదో లేదని సామెత! ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి అలానే అయ్యిందని వ్యాఖ్యానిస్తున్నారు విశ్లేషకులు. టీడీపీకి బలమైన పునాదులు ఉన్నాయి.. స్వర్గీయ ఎన్టీఆర్ రామారావు బొమ్మ ఉంది.. గ్రౌండ్ లెవెల్ లో భారీ కేడర్ ఉంది.. ప్రచారానికి పనికొచ్చే సినీజనాలు ఉన్నారు.. బలమైన సామాజికవర్గ అండదండలున్నాయి.. వెనకాముందూ చూడకుండా, మోరల్స్ మరిచిపోయిమరీ వెనకేసుకొచ్చే మీడియా కూడా ఉంది. అయినా కూడా టీడీపీకి ఎందుకిలా అయిపోయింది?

రాబోయే ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏమిటి అనేది.. తాజాగా జరిగిన మహానాడులో తెరపైకి వచ్చిన విభేదాలు ఒక కారణం అయితే… అంతకుమించిన బలమైన కారణం తొలివిడత మేనిఫెస్టో! ఈ మేనిఫెస్టో విడుదల అనంతరం… రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపుతామన్న కాస్తనమ్మకం కూడా పోయిందని స్వయంగా టీడీపీ నేతలే చెబుతున్న పరిస్థితి! ఇక కార్యకర్తల సంగతైతే చెప్పేపనేలేదు. తమ పరువు కూడా తీసేస్తున్నారంటూ మనోవేదన చెందుతున్నారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి.

ముందుగా “అమ్మకు వందనం” అనే పేరుతో ఒక హామీ ప్రకటించారు చంద్రబాబు. ఈ హామీని టీడీపీ అనుకూల మీడియా కూడా హైలైట్ చేయలేని పరిస్థితి. ప్రధాన శీర్షికల్లో పెట్టలేక ఇబ్బందిపడిన వైనం! ఇది ప్రస్తుతం వైసీపీ అమలు చేస్తున్న “అమ్మఒడి” పథకాన్ని కాపీ అనేది అందరికీ తెలిసిన విషయమే! అయినా కూడా చంద్రబాబు అంత ధైర్యంగా ఎలా పెట్టారనేది టీడీపీ సీనియర్స్ కి సైతం అర్ధంకాని విషయం. అంటే… జనాలు అప్ డేట్ అయ్యారనే విషయం గ్రహించడంలో బాబు ఇంకా అప్ డేట్ అవ్వలేదన్నమాట!

ఇదే సమయంలో మిగిలిన హామీలన్నీ… కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలే! దీంతో… మొత్తం ఆశలన్నీ అడియాశలైపోయాయనేది తమ్ముళ్ల ఆవేదనగా ఉంది.

ఇక మిగిలిన విషయానికొస్తే… “పూర్ టు రిచ్” పై ఆన్ లైన్ వేదికగా చంద్రబాబుకు అక్షింతలు పడిపోతున్నాయి. చెప్పే మాటలకు, ఇస్తున్న హామీలకు… ఇప్పుడు చేస్తున్న పనులకు ఏమైనా పొంతన ఉందా అనేది ఏపీ ప్రజల ప్రశ్న! కారణం… పేదలకు సెంటు స్థలం ఇస్తే సహించలేని వ్యక్తి.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తామంటే భరించలేని వ్యక్తి.. పేదలకు మేలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని కోర్టుకు వెళ్లి అడ్డుకుంటూ తన అక్కసు వెళ్లగక్కే వ్యక్తి… పేదలందరినీ ధనవంతులను చేస్తానని చెబితే ఎవరు నమ్ముతారు? 2014 ఎన్నికలలో తన మేనిఫెస్టోలో ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం హామీలను కూడా నెరవేర్చని వ్యక్తి మాటలను ఇప్పుడు ఎవరు నమ్ముతారు?

ఇదే టీడీపీకి ఉన్న సమస్య! నమ్మకం.. విశ్వసనీయత! చంద్రబాబు ఇది పూర్తిగా పోగొట్టేసుకుని చాలా కాలమే అయ్యింది! అందుకే… టీడీపీకి అన్నీ ఉన్నా కూడా… నమ్మకమైన నాయకత్వం, విశ్వసనీయమైన అధిష్టాణం లేకపోవడమే ప్రతీ ఫెయిల్యూర్ కీ ప్రధాన కారణం!! అధినాయకత్వం మారితే కచ్చితంగా టీడీపీకి పూర్వ వైభవం వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. అలాకానిపక్షంలో… ఎవరూ టీడీపీని రక్షించలేరని తేల్చి చెబుతున్నారు!