రసవత్తరం: అంబటికి (ఉమ్మడి) ప్రత్యర్థి రెడీ..!

సత్తెనపల్లి వైకాపా ఎమ్మెల్యే, ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. ప్రత్యర్ధులపై తనదైన వాగ్భాణాలు సందించడంలో దిట్ట అనేది తెలిసిన విషయమే. అయితే.. తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటికి సరైన ప్రత్యర్థిని నిలపడానికి టీడీపీ పక్కా ప్లాన్ రెడీ చేసిందని, అందుకు జనసేన తమ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని తెలుస్తోంది!

గత కొంతకాలంగా అంబటి రాంబాబు పేరెత్తితే అంతెత్తున లేస్తున్నారు టీడీపీ, జనసేన నాయకులు! దీంతో.. పవన్ – (చిన)బాబు లు ఈ సారి తాము గెలవడం ఎంత ముఖ్యమో.. కొడాలి నాని, పేర్ని నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్.. ఇలా మొదలైన వారి గెలుపును అడ్డుకోవడం అంతకన్నా ముఖ్యం అన్న స్థాయిలో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది! దీంతో పవన్ పగ తన పగ కాదా అన్నట్లు తాను కూడా ఫిక్సయ్యారంట (చిన)చంద్రబాబు!

ఫలితంగా ఉన్నంతలో, తనకు అందుబాటులో ఉన్నంతలో కాస్త బలమైన నేతను రంగంలోకి దింపుతున్నారంట. అందులో భాగంగా.. ఈ అవకాశం కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వాలని నిర్ణయించారంట బాబు & మిత్ర బృందం! ఇప్పటికే బీజేపీలో అసమ్మతి రాగం వినిపించి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఫిక్సయ్యారు కన్నా!

దీంతో.. జనసేన సెకండ్ టాపర్ నాందేండ్ల తో సమావేశం కూడా అయ్యారు. అయితే కారణాలు తెలియదు కానీ.. ఆ మీటింగ్ ప్రతిఫలం ఇవ్వలేదు! అయితే.. ఈ విషయంలో కన్నా మనసంతా టీడీపీ పైనే ఉందని స్పష్టం అవడంతో.. బాబు ఈ దిశగా నిర్ణయానికొచ్చారని తెలుస్తోంది! ఈ లెక్కన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, సత్తెనపల్లిలో టీడీపీ – జనసేన ఉమ్మడి ప్రత్యర్థి ఫిక్సయ్యినట్లేనని అంటున్నారు విశ్లేషకులు!