వైసీపీకి షాకిచ్చిన అంబటి: కాపులంతా పవన్ వైపే.!

‘కాపు సామాజిక వర్గానికి చెందినవారంతా పవన్ కళ్యాణ్ మావాడంటూ గోక్కుంటున్నారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు.!

గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అంబటి రాంబాబు తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఇదే అంబటి రాంబాబు బతిమాలుకున్నారు.

‘మీకు పవన్ కళ్యాణ్ మీద అభిమానముంటే వుండొచ్చుగాక.. కానీ, నాకు మాత్రం ఈసారికి ఓటెయ్యండి.. నన్ను గెలిపించండి.. జనసేన గ్లాసు.. నా గుండెల్లో బాకుగా మారకూడదు..’ అంటూ ఓటర్లను, పవన్ కళ్యాణ్ అభిమానుల్నీ అంబటి రాంబాబు అభ్యర్థించారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వుంటాయ్.

వైసీపీ అధికారంలోకి వచ్చాక మాత్రం, పవన్ కళ్యాణ్ మీద తరచూ తూలనాడుతూనే వస్తున్నారు అంబటి. రాజకీయాల్లో ఇవన్నీ మామూలే. వైసీపీ నుంచి పవన్ కళ్యాణ్ మీద ధాటిగా విమర్శలు చేసే నాయకుల్లో అంబటి కూడా ఒకరు. ఆ కోటాలోనే ఆయనకు మంత్రి పదవి దక్కింది కూడా.

అందుకే, తనకప్పగించిన మంత్రిత్వ శాఖ వ్యవహారాల గురించి తెలుసుకోకపోయినా, పవన్ కళ్యాణ్ మీద విమర్శలతో టైమ్ పాస్ చేస్తుంటారాయన.
నిజానికి, అంబటి ఏ ఉద్దేశ్యంతో ‘కాపులంతా పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నారు..’ అని అన్నారోగానీ, అది వైసీపీకి చాలా పెద్ద షాక్ ఇచ్చే విషయం.

నిజానికి, కాపులంతా పవన్ కళ్యాణ్ వెంట నడవరు. ఏ సామాజిక వర్గానికైనా ఇది వర్తిస్తుంది. మరి, అంబటి ఎందుకు ఇలా అన్నారు.? ఎక్కడో తేడా కొడుతోందే.! ‘గోక్కోండి’ అన్నమాట కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కాపు నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం విశేషమే మరి.!