గత రెండు వారాలుగా ఏపీ రాజకీయాలు వేడెక్కి పోతున్నాయి. ఇందులో భాగంగా… పవన్ వారాహి యాత్రలో భాగంగా చేస్తోన్న విమర్శలపై అధికారపార్టీ నేతలు కొంతమంది విరుచుకుపడుతుంటే… మరికొంతమంది సెటైర్లు వేస్తూ ఉడికించేపనికి పూనుకుంటున్నారు. ఈ విషయంలో అంబటి రాంబాబు ముందుంటున్నారు.
అవును… పవన్ పై వెటకారపు ట్వీట్లు చేస్తూ, వ్యంగ్యపు కామెంట్లు చేయడంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు ముందుంటారనేది తెలిసిన విషయమే. ఇందులో భాగంగా ఇప్పటికే ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసిన అంబటి తాజాగా మరోమారు మైకులముందుకు వచ్చారు. ఈ సమయంలో మరోమారు పవన్ పెళ్లిళ్లపై తనదైన శైలిలో స్పందించారు.
ఈ సందర్భంగా మైకందుకున్న అంబటి రాంబాబు… పవన్ కళ్యాణ్ వారాహి వాహనం ఎక్కి అసత్య ప్రచారాలు చేస్తూ.. అసభ్య పదజాలం వాడుతున్నాడని మండిపడ్డారు. ఫలితంగా… వారాహి కాస్త వరాహం (పంది)గా మారిందని, దాని మీద పవన్ కల్యాణ్ ఊరేగుతూ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదే సమయంలో పవన్ మూడు పెళ్లిళ్లపై స్పందించిన అంబటి.. మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. “పెళ్లిళ్ల విప్లవ వీరుడు పవన్ కళ్యాణ్” అని అభివర్ణించారు. అదేవిధంగా… తాను పెద్ద విప్లవకారుడిని అని చెప్పుకుంటున్న పవన్… నలుగురు విప్లవకారుల పేర్లు తెలిసినంత మాత్రాన్న విప్లవకారుడు అయిపోతాడా? అని ప్రశ్నించారు.
ఇదే సమయంలో రాజకీయాల్లో తీసుకొచ్చే విప్లవాల సంగతేమో కానీ… వివాహ వ్యవస్థలో మాత్రం పవన్ కళ్యాణ్ విప్లవం తెచ్చాడని, ఆయన పెళ్లిళ్ల వీరుడు అని అంబటి విమర్శించారు. ఈ సందర్భంగా… వివాహవ్యవస్థపై పవన్ కళ్యాణ్ కు నమ్మకం లేదని, అసలు ఆయనలోనే ఏదో తేడా ఉందని అంబటి వ్యాఖ్యానించగడం గమనార్హం.
అనంతరం చంద్రబాబు, లోకేష్ ల పల్లకీలు మోస్తున్న పవన్ కు పోరాటం గురించి మాట్లాడే హక్కు లేదన్న అంబటి… ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీని చంద్రబాబుకు అమ్మేశాడనే అనుమానం ఉందని ఆరోపించారు. దీంతో… తాజాగా పవన్ పై అంబటి చేసిన కామెంట్లు, వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.