బాబు లేఖపై జైలు అధికారుల ట్విస్ట్… వైసీపీ నాలుగు ప్రశ్నలు పీక్స్!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో సుమారు 43 రోజులుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన జైలు జీవితం… ఈ విజయదశమి రోజుతో 44వ రోజుకు చేరుకుంది. ఈ సమయంలో తన నీతి నిజాయితీల గురించి చెప్పుకుంటూ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు చెబుతూ చంద్రబాబు ప్రజలకు లేఖ రాశారని చెబుతూ ఒక లేఖ టీడీపీ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.

ఇదే సమయంలో ప్రముఖ దినపత్రికలలోనూ ఆ లేఖ దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా… తాను జైల్లో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నాయని ఆ లేఖలో బాబు రాసినట్లుగా ఆ లేఖలో ఉంది. దీంతో… ములాఖాత్‌ లో భాగంగా తనను క‌లిసిన కుటుంబ‌స‌భ్యుల‌కు చంద్రబాబు దసరా సందర్భంగా ఈ లేఖ రాసి అంద‌జేశారని ప్రచారం జరుగుతోంది. ఈ లేఖను తెలుగుదేశం పార్టీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ప్రధాన దినపత్రికలు దీన్ని ప్రముఖంగా ప్రస్థావించాయి!

జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల తన ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందని.. తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని.. వీటితోపాటు ఓటమి భయంతోనే జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామని అనుకుంటున్నారు కానీ… అభివృద్ధి రూపంలో తాను ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటానని చంద్రబాబు రాసినట్లుగా ఆ లేఖలో ఉంది.

ఇదే సమయంలో… తనపై అవినీతి ముద్ర వేయాలని కుట్రలతో ప్రయత్నించారని ఆరోపించడంతోపాటు ప్రస్తుత చీకట్లు తాత్కాలికమేనని, సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని చంద్రబాబు రాసినట్లు చెబుతున్న ఆ లేఖలో ఉంది. ఫైనల్ గా… త్వరలోనే బయటకొచ్చి ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని ఆ లేఖలో రాసి ఉంది.

ఈ సమయంలో ఆ లేఖపై వైసీపీ సీరియస్ గా స్పందించింది. ఇందులో భాగంగా.. “చంద్రబాబు 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా.. నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మార్చారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌ లోకి, 17(ఏ) ప్రోటోకాల్స్‌ లోకి వెళ్లటం లేదు. మీ పేరిట టీడీపీ ఆ లేఖ విడుదల చేసింది. అది చదివిన తర్వాత కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నాను” అంటూ అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా వైసీపీ అధికారిక ట్విట్టర్ లో ఒక పోస్టర్ ను విడుదల చేశారు. అందులో భాగంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. తాను జైల్లో లేను, ప్రజల గుండెల్లో ఉన్నాను అని ఆ లేఖలో పేర్కొనడంపై… “జైల్లో లేనన్నారు కదా.. ఇక న్యాయపోరాటం ఆపేయండి” అని అంబటి తనదైన శైలిలో వెటకారం ఆడిన ఆయన.. “ప్రజల గుండెల్లో ఉంటే.. గుర్తుకొచ్చే నాలుగు స్కీంలు చెప్పండి” అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో… చైతన్యం అంటే నల్ల చొక్కలు వేసుకున్న ఆ నలుగురిదా? సీఎంగా మొదటి సంతకానికే దిక్కులేదు.. మరో మేనిఫెస్టో విడుదల చేస్తే నమ్ముతారా? వెన్నుపోటుకు మద్దతు పలికిన భువనేశ్వరి ఎన్టీఆర్ వారసురాలా? అని ఆ లేఖలో పేర్కొన్న అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇదే సమయంలో… ప్రజలకు బహిరంగ లేఖ అంటూ సానుభూతి డ్రామాకు చంద్రబాబు తెరలేపారని మండిపడ్డారు.

ఇలా చంద్రబాబు నాయుడు సంతకంతో, స్నేహ బ్లాక్, రాజమహేంద్రవరం జైలు పేరున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని జైలు అధికారులు వెల్లడించారు. జైలు నుండి ఏ ముద్దాయి అయినా తన సంతకంతో లేఖ విడుదల చేయ్యాలంటే ముందుగా తమకు తెలియజేయాలని, ఆ లేఖను జైలర్ పరిశీలించి, ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం ఆ లేఖపై జైలర్ సంతకం, స్టాంప్ వేసి కోర్టులకు లేదా ప్రభుత్వ అధికారులకు, కుటుంబ సభ్యులకు ఇస్తారని తెలిపారు.

చంద్రబాబు పేరుతో విడుదలైన ముద్రణ కరపత్రం జైలు నుండి జారీ చెయ్యలేదని, ఆ లేఖతో రాజమండ్రి జైలుకు సంబంధం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. దీంతో… సోషల్ మీడియా వేదికగా రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి! లేఖ ఫేక్ అయితే అందులో చెప్పిన అంశాలు, పేర్కొన్న విషయాలు కూడా ఫేకేనా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. సానుభూతి కోసం ఇలాంటి ప్రయత్నాలు మానుకుంటే గౌరవం ఉంటుందనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం