177 నుంచి 2,130 కోట్లకు… రింగు కథలో అసలు కథ!

ప్రస్తుతం ఏపీలో స్కాముల సందడి నెలకొంది. తవ్వే కొద్దీ కొత్త కొత్త స్కాములు, వాటిలో టీడీపీ నేతలు అనుసరించారని చెబుతున్న సరికొత్త స్కీములు వెరసి… ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో స్కాంల టాపిక్కులే హాట్ టాపిక్కులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ అసలైన మెంట్ వ్యవహారం అతిపెద్ద స్కాం అని.. అందులో ఒక్క వ్యక్తికే వందల కోట్ల మేలు చేకూరేలా ప్లాన్స్ చేశారని చెబుతున్నారు.

ప్రస్తుతం స్కిల్ డెవలప మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు… ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్, క్వాష్ పిటిషన్స్ తీర్పుల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో స్కిల్ స్కాంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్, అంగళ్ల అల్లర్లకు సంబంధించిన కేసుల పిటిషన్స్ కూడా బాబు మెడపై వేళాడుతున్నాయని అంటున్నారు.

అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం తర్వాత లోకేష్ పేరు కూడా ప్రముఖంగా వినిపించిన ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ స్కాం వ్యవహారంపైనే సీఐడీ బలంగా దృష్టి సారించిందని చెబుతున్నారు. పైగా ఈ కేసులో లోకేష్ ను 14వ నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ సమయంలో అసలు ఇది స్కాం ఎలా అయ్యింది.. ఇందులో దాగున్న క్విడ్ ప్రోకో ఏమిటి అనేది ఆసక్తిగా మారింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏ-1 గానూ, మాజీ మంత్రి నారాయణ ఏ-2గానూ, లింగమనేని రమేష్ ఏ-4, లింగమనేని రాజశేఖర్ ఏ-5, నారా లోకేష్ ఏ-14గా ఉన్న సంగతి తెలిసిందే. ఈకేసులోనూ త్వరలోనే అరెస్ట్‌ లుండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు సీఐడీ అధికారులు కసరత్తులు చేస్తున్నారని సమాచారం. ఐతే ఈ వ్యవహారంలో తవ్వేకొద్దీ నిజాలు ఎలా వెలుపలకి వస్తున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్చడం వల్ల ఒక్క లింగమనేని రమేష్ భూముల విలువ 177 కోట్ల రూపాయల నుంచి 877 కోట్ల రూపాయలకు పెరిగిందని అంటున్నారు. ఈ మేరకు ఈ విషయంపై సీఐడీ బలంగా ఆరోపిస్తోంది. ఇదే సమయంలో రాజధాని నిర్మాణం మొత్తం పూర్తయితే ఆ భూముల విలువ సుమారు రూ. 2,130 కోట్ల వరకూ విలువ చేరేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు సీఐడీ అధికారులు బలమైన ఆధారాలను సేకరించారని సమాచారం!

ఇదే విషయాలపై తాజాగా ఏపీ అసెంబ్లీలో అధికారపార్టీ సభ్యులు సవివరంగా వివరించే ప్రయత్నం చేశారు. లింగమనేని భూములకు, హెరిటేజ్ ఆస్తులకు, నారాయణ కలాశాలలకు ఆనుకునేలా ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అలన్ మెంట్ మార్చారని, ఫలితంగా వారి వారి ఆస్తుల విలువ నాలుగైదు రెట్ల మేర పెరిగేలా ప్రణాళికలు రచించారని అంటున్నారు. దీన్నే క్విడ్ ప్రోకో అంటారని స్పష్టం చేస్తున్నారు.

మరోపక్క… ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో వాదన్లు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోపక్క చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై కూడా ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరగనుందని అంటున్నారు.