బిగ్ బ్రేకింగ్… ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-14గా లోకేష్!

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా.. మరోపక్క అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌ మెంటు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ను 14వ నిందితుడిగా చేరుస్తూ సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఈ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

గతకొన్ని రోజులుగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసుపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంలో లోకేష్ పేరు బలంగా వినిపించే అవకాశం ఉందనే కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యలో సీఐడీ కోర్టులో అధికారులు తాజాగా మెమో ఫైల్ చేస్తున్నారు. సీఐడీ అధికారులు ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు.

మరోపక్క హైకోర్టులో అమరావతి రింగ్‌ రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌ కేసు ఈ రోజు మధ్యాహ్నం వాదనలు వినే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ కేసులో బెయిల్ కోరుతూ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. మరోపక్క సుప్రీంలో బాబు తరుపు న్యాయవాదులు వేసిన క్వాష్ పిటిషన్ పై రేపు విచారణలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగా… ప్రభుత్వ హయాంలో సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డును ప్రతిపాదించిన ప్రభుత్వం ఆ తర్వాత దీని అలైన్మెంట్లో పలు మార్పులు చేసింది. ఫలితంగా… బాబుకు ఉండవల్లి కరకట్టపై ఇల్లు, అప్పటి మంత్రి నారాయణకు భూములు క్విడ్ ప్రోకోగా దక్కాయని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ఇప్పటికే సీఐడీ ఏ1గా చేర్చగా.. నారాయణను ఏ2గా చేర్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసులో లోకేష్ ను ఏ-14గా చేర్చింది.