స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-14గా ఉన్న లోకేష్ కు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇదే సమయంలో 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని సీఐడీ అధికారులకు సూచించింది. దీంతో ప్రస్తుతం సీఐడీ అధికారులు హస్తినలో ఉన్నారని అంటున్నారు.
ఆ సంగతి అలా ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కాం మరింత పెద్దదని అంటున్నారు పరిశీలకులు. ఈ ఇన్నర్ రింగ్ రోడ్ పేరు చెప్పి జరిగిన క్విడ్ ప్రోకో అత్యంత భారీ అయిన స్కాం అని చెబుతున్నారు. ఈ స్కాంలో ఇప్పటికే చంద్రబాబు, నారాయణలు టాప్ లిస్ట్ లో ఉండగా… తాజాగా లోకేష్ ను విచారణకు తీసుకెళ్లబోతున్నారు!
ఈ సమయంలో ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్ ను ఏ–6 గా పేర్కొంది సీఐడీ. అవును… అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం కేసులో ఏ-6 గా హెరిటేజ్ ఫుడ్స్ ని చేర్చింది సీఐడీ. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారని.. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు అడ్డగోలుగా ప్రయోజనం కల్పించారని అంటున్నారు.
దీంతో… ఈ కేసులో ఏ–1 గా ఉన్న చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్ కు వైస్ చైర్ పర్సన్, ఎండీగా ఉండగా… ఏ–14 గా ఉన్న లోకేష్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉందని చెబుతున్నారు. ఇందులో 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేష్ పేరునే ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్ ని ఏ-6గా పేర్కొంది సీఐడీ!