ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ని కొనసాగించాలంటూ ప్రభుత్వం తీరు పై అమరావతి ప్రాంత ప్రజలు , రైతులు ప్రారంభించిన ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తి అయింది. ఏడాది నుంచి అమరావతి ప్రాంతంలోని రైతులు నిరసన తెలుపుతున్నారు. ఈ ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాయపూడిలో జనభేరి పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది అమరావతి జేసీఏ.
ఈ సభకు రాజధాని కోసం భూములిచ్చిన రైతులంతా హాజరుకానున్నారు. దాదాపు 30వేల మందికిపైగా ఈ సభలో పాల్గొంటారని అమరావతి జేఏసీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభ వేదికగా రైతులు భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ఇతర పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా ఈ సభకు వస్తారని సమాచారం. దీంతో చాలాకాలం తరువాత ఏపీలో టీడీపీ, బీజేపీ నేతలు ఒకే వేదికను పంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఉద్యమానికి ముందునుండి చంద్రబాబు మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నేటితో ఈ ఉద్యమం ఏడాది పూర్తి చేసుకోవడంతో… అమరావతి రైతులు నేడు ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇకపోతే , గత ఏడాది ఇదే రోజున ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించారు. జగన్ నిర్ణయంపై అమరావతి ప్రాంతంలో ఆందోళనలు మొదలయ్యాయి. తుళ్లూరు, వెలగపూడి, మందడం, రాయపూడి తదితర చోట్ల పెద్ద ఎత్తున నిరసన దీక్షలు చేపట్టారు.