అమరావతి ఎఫెక్ట్‌: ‘సోము’కీ ‘కన్నా’కి పట్టిన గతేనా.?

Amaravati effect on Somu and Kanna

‘మూడు రాజధానులు వద్దే వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు..’ అన్నందుకే కదా, ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మినారాయణ ‘మాజీ’ అయ్యింది.? ఇప్పుడు అదే మాట ఏపీ బీజేపీ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు చెబుతున్నారు. మరి, కన్నా లక్ష్మినారాయణకు జరిగిన సన్మానమే, సోము వీర్రాజుకీ జరగబోతోందా.? అంటే, ఔననే అంటున్నారట బీజేపీలోని వైసీపీ సానుభూతిపరులు. బీజేపీలో చాలా గ్రూపులున్నాయి. అందులో ఒకటి వైసీపీ సానుభూతిపరుల గ్రూప్‌. ఇంకోటి టీడీపీ సానుభూతిపరుల గ్రూప్‌. మరోటి, నిఖార్సయిన బీజేపీ గ్రూప్‌. నిజమేంటంటే, నిఖార్సయిన బీజేపీ గ్రూపుని, వైసీపీ అనుకూల గ్రూపు, టీడీపీ అనుకూల గ్రూపు డామినేట్‌ చేస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ వైసీపీ అనుకూల గ్రూపు డామినేషన్‌ ఇంకాస్త ఎక్కువే. అందుకే మరి, కన్నా లక్ష్మినారాయణ పదవి ఊడిపోయిందనే చర్చ ఇప్పటికీ గట్టిగానే సాగుతోంది.

Amaravati effect on Somu and Kanna
Amaravati effect on Somu and Kanna

3 క్యాపిటల్స్‌పై బీజేపీ అధిష్టానం ఆలోచన ఏంటి.?

బీజేపీ అధిష్టానం ఏమనుకుంటోందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే, అక్కడ నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రధాని నరేంద్ర మోడీనే. ఆయన మనసులో ఏముందో అమిత్‌ షా, జేపీ నడ్డా లాంటివారికే ఓ పట్టాన అర్థం కాదనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లోనే బలంగా వినిపిస్తుంటుంది. అలాంటిది, ఏపీ బీజేపీ అధ్యక్షుడు.. సింగిల్‌ క్యాపిటల్‌.. అని బల్లగుద్దేసి, పైగా అదే ఆలోచన బీజేపీ అధిష్టానం కూడా చేస్తోందని చెబితే ఎలా.? ‘నేను చెప్పినా, పార్టీ అధిష్టానం చెప్పినా ఒకటే మాట..’ అని సోము వీర్రాజు చెప్పడం, అధిష్టాన పెద్దల్లో కొందరికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.

 

రాష్ట్రంపై బీజేపీ చిత్తశుద్ధి ఏదీ.!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి ప్రస్తుతం రాజధానిగా వుంది. అవును, ‘వుంది’ అంటే, ‘వుంది’ అనుకోవడానికే తప్ప, అందులో అభివృద్ధి అనేది అస్సలేమీ లేదు గడచిన ఏడాదిన్నర కాలంగా. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడి ఏడేళ్ళు పూర్తవబోతోంది. అయినాగానీ, ఇంతవరకూ రాష్ట్రానికి సరైన రాజధాని లేదంటే, అది రాష్ట్ర ప్రజలకు అవమానకరమే కదా.! నిజానికి ఇది ఆత్మగౌరవ సమస్య. బీజేపీ – టీడీపీ కలిసి రాష్ట్రాన్ని నాలుగేళ్ళు పాలించాయి.. అయినా, రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా పోయింది. బీజేపీకి, ఆంధ్రప్రదేశ్‌ మీద చిత్తశుద్ధి వుంటే.. తొలుత రాజధాని అంశంపై కేంద్ర నాయకత్వం స్పష్టత ఇవ్వాలి. కానీ, బీజేపీ నుంచి అలాంటి స్పష్టతని ఆశించలేం.

వీర్రాజు ఆవేశంపై నీళ్ళు చల్లేసినట్టేనా.?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజధాని అమరావతిపై స్పష్టత ఇచ్చినప్పటికీ, ఆ వాదనను బీజేపీలో జాతీయ నాయకులనదగ్గరవారెవరూ ఇప్పటిదాకా సమర్థించలేదు. రాజధాని అమరావతి కోసం ఆందోళనలు మొదలై ఏడాది పూర్తి కావచ్చిన తరుణంలో.. బీజేపీకి ఇంతకంటే మంచి తరుణం ఇంకోటి దొరకదు.. రాష్ట్రంలో బలపడాలనుకుంటే. ఒకటో, మూడో.. ఏదో ఒక విషయాన్ని బీజేపీ అధిష్టానం తేల్చకుండా నాన్చితే, మొన్న కన్నా.. ఇప్పుడు సోము.. ఇలా ఏపీ బీజేపీకి అధ్యక్షులే వుంటారు.. పార్టీకి మాత్రం వారి వల్ల ప్రయోజనం ఏమాత్రం వుండదు.. పార్టీ వల్ల వారికీ ఏ మాత్రం ప్రయోజనముండదు.