ఆంధ్రపదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి చంద్రబాబు హయాంలో జరిగిన భూ సమీకరణ వ్యవహారంపై వైసీపీ పదే పదే ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే. తాము అధికారంలోకి వచ్చాక ఆ అవకతవకలపై విచారణ జరిపిస్తామని చెప్పిన వైసీపీ, ఈ దిశగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుకి అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అసైన్డ్ భూములకు సంబంధించి నమోదైన కేసుల విచారణ ఇప్పటికే జరుగుతోన్న విషయం విదితమే. ఈ కేసుల విచారణలో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబుతోపాటు మాజీ మంత్రి నారాయణ సహా పలువురు టీడీపీ నేతలకు సీఐడీ నోటీసులు జారీ చేసే అవకాశం వుంది. అసైన్డ్ భూముల విషయమై పెద్దయెత్తున విమర్శలు చంద్రబాబు హయాంలోనే వినిపించాయి. అయితే, వాటిని చంద్రబాబు బృందం కొట్టి పారేసింది. అయితే, టీడీపీ నేతలు పలువురు ఆ భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేశారనీ, ఈ క్రమంలో బెదిరింపుల పర్వానికి దిగారనీ వైసీపీ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పలు కేసులు కోర్టు విచారణలో వుండడం గమనార్హం.
విచారణ నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు సన్నిహితులు కొందరు కోర్టులను ఆశ్రయించడం, కొన్ని సందర్భాల్లో వారికి ఉపశమనం లభించడం తెలిసిన విషయాలే. ఇప్పుడు సరాసరి చంద్రబాబుకే సీఐడీ నోటీసులు జారీ చేయడంతో, ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగిందని అనుకోవాలేమో. చంద్రబాబు అరెస్ట్ తప్పదని వైసీపీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. అదే జరిగితే, రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక పెను సంచలనం కాబోతోంది.