తెలంగాణ రాష్ట్ర విద్యుత్ , ఎస్సీ అభివృద్ది శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పై హత్యకు రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఓ వాహనంలో సెప్టెంబర్ 2న మంత్రి స్వగ్రామమైన సూర్యాపేట జిల్లా నాగారం వచ్చారు. డ్రోన్ తో గ్రామ వీధులు, డొంక రోడ్లను చిత్రీకరించినట్టు గ్రామస్థులు చెబుతున్నారు.
రెక్కి నిర్వహించినది ప్రగతి నివేదన సభ జరిగిన 2న అని కొందరు కాదు ఆగష్టు 30 అని మరికొందరు గ్రామస్థులు చెబుతున్నారు. ఆగష్టు 30 న అయితే జగదీష్ రెడ్డి ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి నాగారం వచ్చారు. ఆయన నాగారంలో సెక్యూరిటి లేకుండానే తిరుగుతారు. స్వంత ఊరు కాబట్టి గ్రామస్థులందరితో కలుస్తూ మాట్లాడుతూ ఊరంతా కలియతిరుగుతారు.
జగదీష్ రెడ్డి గ్రామానికి వస్తే సన్నిహితుల ఇళ్లకు, పొలం వద్దకు వెళుతారు. ఇలాంటి సమయంలోనే దాడి చేయాలని పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. దీని పై పోలీసులు విచారిస్తున్నారు. ఏడాది కింద ఆయన సూర్యాపేటకు వస్తుండగా ఎర్రసానిగూడెం వద్ద హఠాత్తుగా ఓ వ్యాన్ వచ్చి మంత్రి కాన్వాయ్ లోని వాహనాన్ని గుద్దింది. అనంతరం అది కనిపించకుండా పోయింది. రెక్కీ నిర్వహించినట్టు సమాచారం ఉందని, త్వరలోనే రెక్కీ నిర్వహించిన వారిని పట్టుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు.
మంత్రికి పలు హత్య కేసులతో సంబంధాలు ఉన్నాయని గతంలో ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా జగదీష్ రెడ్డి అండ చూసుకునే నకిరేకల్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం తన బెదిరింపులు, హత్య కుట్రలు చేస్తున్నారని ప్రతిపక్షాలు బాహాటంగానే విమర్శించాయి. నల్లగొండ బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య, ఇతర కేసులతో మంత్రికి సంబందాలున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల వేళ సానుభూతి కోసమే మంత్రి హత్యకు రెక్కీ నిర్వహించారని వార్తలు సృష్టిస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.