వున్నవి నాలుగు సీట్లు.. బరిలో నిలిచింది నలుగురు అభ్యర్థులు. సో, వివాదమేముంది.? ఏకగ్రీవంగా వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ధృవ పత్రాల్ని అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాగా, ఇద్దరు బీసీలు. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారైతే, ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు.
తెలంగాణ కోటాలో వైసీపీ ఎందుకు రాజ్యసభ అభ్యర్థుల్ని ఖరారు చేసిందన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపడం ద్వారా బీసీ ఓటు బ్యాంకు వైసీపీకి మరింత బలంగా వుంటుందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించొచ్చుగాక. ఆయనకే అంత బలం వుంటే, గతంలో టీడీపీ నుంచి ఏకంగా తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారాయె. కానీ, టీడీపీని గెలిపించలేకపోయారు కదా.?
ఇక, నిరంజన్ రెడ్డి విషయానికొస్తే, రెడ్డి సామాజిక వర్గం.. పైగా, వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుకి సంబంధించి, న్యాయ వాదిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చాలా చాలా ఉపయోగపడ్డారు. బీద మస్తాన్ రావు గతంలో టీడీపీలో పని చేశారు. ఆర్థికంగా చాలా ఉన్నత స్థితిలో వున్నారాయన. విజయసాయిరెడ్డి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్ ఏ1 నిందితుడైతే, విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా వున్నారు.
రెండో సారి రాజ్యసభకు తనను పంపడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి. మరోపక్క, కొత్తగా రాజ్యసభకు ఎంపికైన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రిని తాజాగా కలిశారు.. కృతజ్ఞతలు తెలిపారు.