AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా భారీ స్థాయిలో పెన్షన్లను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా ప్రతినెల పెన్షన్లను ఎంతో విజయవంతంగా అందజేస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వ హయామంలో జరిగిన అవకతవకలు కారణంగా అర్హత లేనటువంటి వారు కూడా పెన్షన్ తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వెరిఫికేషన్ చేపట్టి అనర్హులను తొలగించబోతున్నట్లు తెలుస్తుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగుల కేటగిరీలో భాగంగా 6000 రూపాయల పెన్షన్ ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే చాలామంది గత ప్రభుత్వ హయాంలో ఫేక్ సర్టిఫికెట్ ద్వారా పెన్షన్ అందుకుంటున్నారని అధికారుల దృష్టికి వచ్చింది. ఈ క్రమంలోనే నేటినుంచి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ ప్రారంభమైంది.మంచానికే పరిమితమై రూ.15వేల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ల ఇళ్లకు వెళ్లి వైద్య బృందాలు పరీక్షలు చేస్తాయి.
నెలకు రూ.6వేలు తీసుకుంటున్న దివ్యాంగులకు దగ్గరలోని ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేస్తారు. పెన్షన్ దారులు హాజరుకాకపోయినా, బృందం ఇంటికి వెళ్లినప్పుడు అందుబాటులో లేకపోయినా వాళ్ల పెన్షన్ హోల్డ్ లో పెట్టేస్తారు. ఇలా పరీక్షలకు హాజరు కాకపోతే వారి పెన్షన్ తీసేసే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
గత ప్రభుత్వ హయామంలో సుమారు 3.20 లక్షల మంది అనర్హులు పెన్షన్ అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా అనర్హులను తొలగించి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. ఇలా అనర్హులను తొలగించి ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా 50 సంవత్సరాల వయసు ఉన్న వారందరికీ కూడా కొత్త పెన్షన్ అమలు చేయాలనే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉందని తెలుస్తుంది.