వ‌చ్చీ రాగానే మొదలుపెట్టేసిన విజయసాయిరెడ్డి!

గ‌త కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాల‌కు దూరంగా ఉంటున్న వైసీపీ ఎంపీ, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ చార్జ్ విజ‌య‌సాయిరెడ్డి మ‌ళ్లీ యాక్టీవ్ అయ్యారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న బాధ్యతలు చేప‌ట్టారు. అనంతరం… వ‌చ్చీ రాగానే వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో స‌మావేశం నిర్వహించడం విశేషం. దీంతో భవిష్యత్తులో త‌న ప‌నితీరు ఎలా వుండ‌నుందో ఆయ‌న చెప్పకనే చెప్పారు.

అవును… గతకొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు విజయసాయిరెడ్డి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయ‌క‌పోగా, ఆయా సంద‌ర్భాల్లో వారితో సానుకూలంగా వ్య్వహ‌రించ‌డం వంటివి కూడా చేశారు. దీంతో జగన్ కు సాయిరెడ్డికీ చెడిందని.. ఫలితంగా వైసీపీకి దూర‌మ‌వుతార‌ని ఒక కీలక చర్చ తెరపైకి వచ్చింది.

ఇదే సమయంలో ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తనను త‌ప్పించ‌డంతో నాడు సాయిరెడ్డి మౌనం పాటించారు. అయితే తాజా పరిణామాలతో సాయిరెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఇందులో భాగంగా… వైసీపీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్ తోపాటు పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్ బాధ్యతల్ని అప్పగించారు.

ఈ సమయంలో తాజాగా బాధ్యతలు స్వీకరించిన సాయిరెడ్డి… పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడానికి కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను సమన్వయం చేసుకొని త్వరితగతిన పార్టీ అనుబంధ విభాగాల జోనల్‌ ఇన్‌ చార్జిలు, జిల్లా అధ్యక్షులు, మండల ఇన్‌ చార్జిల ఖాళీలను భర్తీ చేయాలని చెప్పారు.

ఇదే సమయంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జయహో బీసీ మహాసభ తరహాలోనే ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ మ‌హాస‌భ‌ల్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో గ్రౌండ్ లెవెల్లో మీ అందరికీ ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించడం గమనార్హం.

మరి “ఆఫ్టర్ లాంగ్ గ్యాప్.. సాయిరెడ్డి ఈజ్ బ్యాక్” అన్నట్లుగా ఉన్న ఈ వ్యవహారం… ముందు ముందు ఎలాంటి సంచలనాలకు కేంద్రబిందువవుతుందనేది వేచి చూడాలి!