వద్దనుకున్నా వరించిన పదవిని భారంగా భావించక ఎవరైనా ఏం చేస్తారు.? మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడి పరిస్థితి ఇదేనట.! విధిలేని పరిస్థితుల్లో అచ్చెన్నాయుడికి టీడీపీ ఏపీ అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించారు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. ఈ విషయమై చాలా తర్జనభర్జనలు నడిచాయి. ఈఎస్‌ఐ స్కాంలో గనుక అచ్చెన్నాయుడు అరెస్టయి వుండకపోతే, ఆ పదవి ఆయనకు వచ్చేదే కాదంటూ టీటీడీపీలోనే కొందరు నేతలు ఆఫ్ ది రికార్డ్‌గా చర్చించుకుంటున్న పరిస్థితి ఇప్పటికీ కనిపిస్తోంది. సరే, ‘అదంతా ట్రాష్’ అని అచ్చెన్న అండ్ టీమ్ కొట్టి పారేయొచ్చుగాక. ఏపీ టీడీపీ అధ్యక్షుడయ్యాక, అచ్చెన్నాయుడు ఇంతవరకు ఏం సాధించినట్లు.? చంద్రబాబు జూమ్ ద్వారా చెప్పాలనుకున్నవన్నీ చెప్పేస్తున్నారు. టీడీపీలో మిగతా నేతలు ఎవరి పని వారు చేసుకుపోతున్నారు.
కానీ, అచ్చెన్న వ్యవహారమే ఎటూ కాకుండా పోయింది. అప్పుడప్పుడూ ప్రభుత్వంపై మండిపడుతూ లేఖలు రాయడం, వీలు చిక్కితే ఓ ప్రెస్ మీట్ పెట్టడమో, న్యూస్ ఛానళ్ళతో మాట్లాడటమో.. ఇంతే, ఇంతకు మించి పెద్దగా పనేమీ వుండటంలేదట అచ్చెన్నాయుడికి. అసలు ప్రజా ప్రతినిథులు కూడా కాని కొందరు టీడీపీ నేతల్ని వెనకేసుకొస్తున్నంతగా టీడీపీ అనుకూల మీడియా అచ్చెన్నాయుడిని వెనకేసుకురాకపోవడం అచ్చెన్న అనుచరుల్ని తీవ్ర ఆవేదనకి గురిచేస్తోంది. ఎంత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినా.. రాష్ట్రంలో తనంతట తానుగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి సమాచారమివ్వడం, ఆయన్ని వెంటేసుకు తిరగడం చెయ్యాలి కదా.? కానీ, నారా లోకేష్ అలాంటి అవకాశమే అచ్చెన్నాయుడికి ఇవ్వడంలేదు. దాంతో, గత కొద్ది రోజులుగా అచ్చెన్న ఒకింత ఎక్కువగానే ఆందోళన చెందుతున్నారట. అచ్చెన్నకు ముందు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావుదీ ఇదే పరిస్థితి. అయితే, కళా వెంకట్రావు సర్దుకుపోయినట్లుగా అచ్చెన్న సర్దుకుపోవడం కష్టమేనన్నది శ్రీకాకుళం జిల్లాలో జరుగుతోన్న చర్చ. ఇటీవల టీడీపీ విజయనగరం జిల్లా పార్టీలో తలెత్తిన విభేదాల సందర్భంగా కూడా ఎవరూ అచ్చెన్నని సంప్రదించకపోవడం.. పార్టీలో అచ్చెన్న పరిస్థితిని చెప్పకనే చెబుతోంది.