తెలుగుదేశంపార్టీలో టెన్షన్ మొదలైంది. కారణం ఏమిటంటే, జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ఐఏ విచారణకు అప్పగించాలని కోర్టు తాజాగా ఆదేశించటమే. ఒకవైపు అసలు ఎన్ఐఏ విచారణనే చంద్రబాబునాయుడు అండ్ కో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. అది అలా వుండగానే నిందితుడిని విచారన నిమ్మితం ఎన్ఐఏకి అప్పగించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలు తెలుగుదేశంపార్టీ పుండుమీద కారం రాసినట్లైంది. కోర్టు ఆదేశాలిచ్చింది కాబట్టి వెంటనే విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఉన్న నిందితుడిని ఎన్ఐఏకి అప్పగించక తప్పదు.
ఇపుడా అంశమే చంద్రబాబు అండ్ కో లో టెన్షన్ కు కారణమవుతోంది. జగన్ పై హత్యాయత్నానికి ప్రయత్నించింది శ్రీనివాసే అని అందరికీ తెలుసు. కానీ శ్రీనివాసును అందుకు ప్రేరేపించింది ఎవరు అన్న విషయమే తేలాల్సుంది. వైసిసి ఆరోపణల ప్రకారం పాత్రదారి శ్రీనివాసే అయినా సూత్రదారి మాత్రం చంద్రబాబే. అయితే, శ్రీనివాస్ రాష్ట్రప్రభుత్వంలోని పోలీసుల రక్షణలో ఉన్నంత వరకూ సూత్రదారుల విషయం తేలే అవకాశం లేదు. అదే ఎన్ఐఏ విచారణలోకి వెళ్ళిపోతే మాత్రం సూత్రదారుల గుట్టు వెంటనే రట్టయ్యే అవకాశం ఉంది.
శ్రీనివాస్ ను విచారణలోకి తీసుకున్న వెంటనే ముందుగా ఎన్ఐఏ దృష్టి సారించేది ఎయిర్ పోర్టులో క్యాంటిన్ ఓనర్ హర్షవర్ధన్ చౌదరి మీదే. ఎందుకంటే, హత్యాయత్నం ఘటనలో హర్షవర్ధన్ పాత్రపైన కూడా పలు అనుమానాలున్నాయి. వైసిపి ఎంత మొత్తుకున్న రాష్ట్ర పోలీసులు అసలు హర్షను విచారించనే లేదు. హర్షను పట్టుకుంటే చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. దాంతో తీగ లాగితే డొంక కదిలినట్లు హత్యాయత్నం కేసులో అసలు సూత్రదారులెవరో తేలిపోతుంది. అందుకనే ఎన్ఐఏ విచారణను చంద్రబాబు అండ్ కో అంతగా వ్యతిరేకిస్తున్నారు. మరి శ్రీనివాస్ విషయంలో ఎన్ఐఏ విచారణ మొదలుపెట్టగానే ఎటువంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో వేచి చూడాల్సిందే.