సర్పంచ్ రిజర్వేషన్ ఆమెకు కలిసి వచ్చింది. స్వంత ఊరి పై మమకారం గ్రామానికి వచ్చేలా చేసింది. గ్రామాభివృద్దిలో తాను పాలు పంచుకుంటానని తనను గెలిపించాలని పల్లె వాసులను అడుగుతూ ఆమె ప్రచారం చేస్తోంది.
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన అనిల్ రెడ్డికి శ్వేతతో వివాహం జరిగింది. అనిల్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తుండగా శ్వేత ఫ్రీ స్కూల్ సంచాలకురాలుగా పని చేస్తోంది. శ్వేత ఎమ్మెస్సీ బీఈడీ చేశారు. వివాహం అయిన తర్వాత నుంచి అమెరికాలో ఉంటున్నారు. శ్వేత మామ లింగారెడ్డి గ్రామ సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికలలో కాసాల గ్రామం ఓసీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో శ్వేత సర్పంచ్ ఎన్నికల్లో పోటి చేయాలని నిర్ణయించుకున్నారు. అమెరికా నుంచి బయల్దేరి గ్రామానికి చేరుకున్నారు.
కాసాలలో మొత్తం ఐదుగురు సభ్యులు సర్పంచ్ ఎన్నికకు పోటి పడుతున్నారు. శ్వేత మాత్రం ఇప్పటికే ఓ ప్రణాళిక వేశారు. సర్పంచ్ గా గెలిస్తే తాను ఏం చేయనున్నానో చెబుతూ 12 అంశాల ఎన్నికల మేనిఫేస్టోను విడుదల చేశారు. వార్డు సభ్యులతో అభివృద్ది కమిటీల ఏర్పాటు, డిజిటల్ గ్రంథాలయం, అంగన్ వాడీలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడం వంటి అంశాల పై కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ప్రచారం చేస్తున్నారు. విద్యావంతురాలు కావడంతో గ్రామ ప్రజలు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు.