కేశినేని ఎఫెక్ట్: విజయవాడలో తెరపైకి కొత్త పేరు!

గత కొంత కాలంగా రహస్యంగా.. గతకొన్ని రోజులుగా బహిరంగంగా చంద్రబాబుకి విజయవాడ టీడీపీ ఎంపీ కొత్త తలనొప్పులు తెస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలను గొట్టంగాళ్లు అనే స్థాయిలో నాని చెలరేగిపోతున్నారు. దీంతో కొడాలి నాని, పేర్ని నాని తర్వాత చంద్రబాబుకు మూడో నానీ కూడా తగిలారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కనిపించడం మొదలయ్యింది. అయితే ఈ సమయంలో నానికి చెక్ పెట్టేందుకు సరికొత్త పేరు తెరపైకి తెచ్చారని తెలుస్తుంది.

అవును.. టీడీపీ ఎంపీ కేశినేని కి చెక్ పెట్టేందుకు కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయని తెలుస్తుంది. గతకొన్ని రోజులుగా కేశినేని నానీ వైఖరితో ఇబ్బంది పడుతున్న టీడీపీ… ఈ మేరకు కొత్త అభ్యర్థిని ఈసారి ఎంపీగా పోటీచేయించాలని చూస్తుందట. అందులో మాజీ ఎంపీ లగడపాటి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటుగా మరో ముగ్గురు రేసులో ఉన్నారని తెలుస్తుంది.

“రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలనుంచి తప్పుకుంటాను” అని ప్రకటించిన లగడపాటి ఆ మాటకు కట్టుబడే ఉన్నారు! అయితే ఆకస్మికంగా విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్ పేరు తెర మీదకు వచ్చింది. ఇదే సమయంలో మరి కొందరి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని పేరు ఇప్పటి వరకు ప్రచారం సాగినా.. తాజాగా కొత్త సమీకరణాలతో నిర్ణయాలు మారిపోతున్నాయని తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో చంద్రబాబు ఫైనల్ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. తన తమ్ముడి కోసం తనను తొక్కేస్తున్నారని కేశినేని నానీ ఆరోపిస్తున్నట్లుగా… బాబు చిన్ని కే సీటు ఇస్తారా.. లేక, లగడపాటితో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయిస్తారా… అదీ గాకపోతే టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయవాడ ఎంపీ సీటు మిత్రపక్షాలకు ఇచ్చేదిశగా ఆలోచిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

కాగా, విజయవాడ టీడీపీ రాజకీయం కేశినేని నాని కేంద్రంగా నడుస్తోన్న సంగతి తెలిసిందే కొంత కాలంగా కేశినేని వ్యాఖ్యలతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. తనకు వ్యతిరేకంగా తన సోదరుడిని టీడీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది కేశినేని ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. విజయవాడ లోక్ సభ పరిధిలోని సొంత పార్టీ నేతల తీరుతో కేశినేని రగిలిపోతున్నారట!