ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని యూపీఏ ప్రభుత్వం వెల్లడిస్తే… అబ్బే కాదు కాదు పదేళ్లు, పదిహేనేళ్లు చేయాలని బీజేపీ కోరింది. 2014 ఎన్నికల సమయంలో ఏపీకి ప్రచారానికి వచ్చిన బీజేపీ, వారితో జతకట్టిన టీడీపీలు… అధికారంలోకి వస్తే హోదా పక్కా అనే స్థాయిలో ప్రచారం చేశారు! అయితే… గెలిచిన తర్వాత ఆ ఊసే లేదు!
అయితే… నాడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచింది మీరే కదా అని బీజేపీని నిలదీస్తే… ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబే ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచారని బీజేపీ చెబుతుంది. అలా ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు – బీజేపీలు దోబూచులాటలు ఆడుకుంటూ ఆంధ్రులను పిచ్చొళ్ళను చేసి, రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు!
ఇప్పుడు వీరికి పవన్ కల్యాణ్ కూడా తోడైనట్లున్నారు! మోడీ పుట్టడం భారతదేశం చేసుకున్న అదృష్టం అన్నస్థాయిలో మాట్లాడే పవన్ కల్యాణ్… ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో గట్టిగా మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం… తాజాగా ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అనే మాటకు బలం చేకూర్చేలా ఐదు అర్హతలను తెరపైకి తెచ్చింది కేంద్రం.
అవును… ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే అందుకు కారణం బీహార్ కు చెందిన జేడీయూ, ఏపీకి చెందిన చంద్రబాబు కారణం అనేది తెలిసిన విషయమే. వీరిద్దరూ పక్కకు తప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం పేకమేడలా కూలిపోతుంది! ఇదే సమయంలో.. ఈ రెండు రాష్ట్రాల నుంచీ ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. ఏపీకైతే… బలమైన ప్రామిస్ లే ఉన్నాయి.
ఇలా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటానికి కారణమైన జేడీయు సభ్యుడు రాంప్రీత్ మండల్… లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో, బీహార్ కి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ప్రశ్నను సంధించారు. ఇదే సమయంలో… బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. దీనిపై కేంద్రం లిఖితపూర్వక సమాదానం ఇవ్వాలని కోరారు!
ఈ సమయంలో ఈ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం కేంద్రం నుంచి వచ్చింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా… బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేశారు! దానికి అవసరమైన ఎన్డీసీ నిబంధనలు ప్రకారం సాధ్యం కాదని చెప్పేశారు. ఈ సందర్భంగా ఆ నిబంధనలు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అందులో మొదటిది… కొండలు, పర్వతాలు, కఠినమైన క్లిష్టమైన భూభాగం ఉన్న ప్రాంతాలు ఉండాలి.
ఇక రెండవది… తక్కువ జనసాంద్రత లేదా అత్యధిక గిరిజన జనాభా కలిగి ఉండాలి.
మూడవది… పక్క దేశాలతో సరిహద్దు కలిగిన ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలు అయ్యి ఉండాలి.
నాలుగవది… ఆర్థిక, మౌలిక వసతుల లేమి.. పారిశ్రామిక వెనుకుబాటుతనం కలిగిన రాష్ట్రాలు అయ్యి ఉండాలి.
అయిదవది… రాష్ట్ర ఆదాయం అత్యల్పంగా ఉండాలి.
ఈ ఐదు అర్హతలూ కలిగి ఉంటేనే ప్రత్యేక హోదాకు అర్హత అని పార్లమెంట్ లో ఎన్డీయే ప్రభుత్వం నుంచి క్లారిటీ వచ్చింది. అందువల్ల బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని మంత్రి స్పష్టం చేశారు! ఇక ఏపీకి కూడా పైనున్న అర్హతలు అన్నీ లేవు కాబట్టి.. బీహార్ కు ముఖం మీద చెప్పి, అదే సమాధానాన్ని అన్వయించుకోమని ఏపీకి కూడా చెప్పారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు అటు బీహార్ లో నితిష్ కుమార్ పనితనపై ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మన భుజాలపై నిలబడి, మనకే హోదా ఇవ్వము అని చెబుతున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వలో కొనసాగడం అవసరమా? అనే ప్రశ్నలు నితీష్ కుమార్ కు బీహార్ ప్రజల నుంచి గట్టిగా ఎదురవుతున్నాయని అంటున్నారు. కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు.
ఇదే సమయంలో… చంద్రబాబు సమర్థతపైనా ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బీహార్ గొడవ మనకెందుకు… మీరు మాత్రం బీజేపీ పెద్దలను గట్టిగా నిలదీయండి.. హోదా రాకపోతే ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటామని చెప్పండి అంటూ 2024 ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన ప్రజానికం సూచిస్తున్నారు. 135 సీట్లు ఉన్నాయి.. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా ఏపీకి మీరే సీఎం అని బాబుకు భరోసా ఇస్తున్నారంట.
అలా కాకుండా 2014 తరహాలో రెండు మూడేళ్లు కేంద్రంతో రాసుకుపూసుకు తిరిగి, మళ్లీ 2029 ఎన్నికలు వచ్చే నాటికి మోడీని, బీజేపీని తిడుతూ పబ్బ గడుపుకోవాలని చూస్తే మాత్రం మీకు మించిన చరిత్ర హీనుడు మరొకరు ఏపీ చరిత్రలో ఉండరని నొక్కి చెబుతున్నారని తెలుస్తుంది. ఇక పవన్ కల్యాణ్ కు కూడా ఇలాంటి సూచనలే అందుతున్నాయని అంటున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురానిపక్షంలో… చేతకాని దద్దమ్మలా మిగిలిపోతారాని, మీ పొలిటికల్ కెరీర్ ఇక్కడితో పరిసమాప్తమని హెచ్చరికలు జారీ చేస్తున్నారట ఏపీ ప్రజానికం!! మరి ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబు, పవన్ లు మోడీ దగ్గర పట్టుబడతారా, అవస్రమైతే కూటమి నుంచి బయటకు వెళ్తామని హెచ్చరిస్తారా.. లేక, చాలా మంది చెబుతున్నట్లు సాష్టాంగపడి కాలం వెళ్లదీస్తూ, ఏపీ ప్రజలను ఏమార్చి చరిత్ర హీనులుగా, చేతకానివారిగా మిగిలిపోతారా అనేది వేచి చూడాలి!!
ఎందుకంటే… కేంద్రం ఇవ్వలానుకుంటే ఇచ్చి తీరుతుంది! మనసుంటే మార్గం ఉంటుంది! కేంద్రం తమకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొచ్చు.. ఇవ్వాలనుకుంటే.. అడిగేవారిలో ధమ్ముంటే!! సాధించాలనే పట్టుదల ఉంటే..!!