టిడిపిలో ముసలం..ఎంపిల తిరుగుబాటు

అనుకున్నంతా జరిగింది. విదేశీ పర్యటనలో ఉండగా చంద్రబాబునాయుడుపై నలుగురు ఎంపిలు తిరుగుబాటు చేశారు. టిడిపిలో ముసలం రాజ్యసభ ఎంపిల రూపంలో ఎదురైంది. రాజ్యసభలో టిడిపికి ఆరుగురు సభ్యులున్నారు. వీరిలో నలుగురు తిరుగుబాటు జెండా లేపారు. తమను రాజ్యసభలో ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతికి లేఖను అందచేయనున్నారు.

మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన దగ్గర నుండి శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. చంద్రబాబుకు వయసైపోవటం, లోకేష్ సామర్ధ్యంపై నమ్మకం లేకపోవటంతో నేతల్లో చాలామంది ఎవరిదారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే టిడిపి ముసలం ముందుగా రాజ్యసభ ఎంపిల నుండే మొదలైంది.

పార్టీకి రాజ్యసభలోని ఆరుగురు సభ్యులున్నారు. గరికపాటి రామ్మోహన్ రావు, సుజనా చౌదరి, సిఎం రమేష్, సీతా రామలక్ష్మి, టిజి వెంకటేష్, కనకమేడల రవీంద్రల్లో రవీంద్ర, రామలక్ష్మి మినహా మిగిలిన నలుగురు తిరుగుబాటు లేవదీశారు. తమను బిజెపి అనుబంధ సభ్యులుగా గుర్తించాలంటూ వెంకయ్యకు రేపో మాపో లేఖను అందచేయనున్నారు.

ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యులే తిరుగుబాటు లేవదీసినా తొందరలో రామలక్ష్మి కూడా చేరనున్నట్లు సమాచారం. వీరి తర్వాత లోక్ సభ సభ్యుడు కేశినేని నాని కూడా టిడిపిని వదిలేస్తారని సమాచారం. ఆ తర్వాత మాజీ ఎంపిలు, మాజీ మంత్రులు, మాజీ ఎంఎల్ఏలు కూడా బిజెపిలో చేరటానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి టిడిపిలో మొదలై ముసలం ఎక్కడిదాకా వెళుతుందో చూడాల్సిందే.